మీకు వంట చేయడం ఇష్టమా? నాగాలాండ్ రెసిపీస్ ఇప్పుడే ట్రై చేయండి
15రకాల గిరిజన తెగలున్న నాగాలాండ్ లో విభిన్న సాంప్రదాయాలు కనిపిస్తాయి. ఆ సాంప్రదాయాలు, సంస్కృతి.. తినే వంటకాల్లోనూ ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ఈశాన్యాన ఉన్న నాగాలాండ్ రాష్ట్ర ప్రజల ప్రత్యేకమైన రెసిపీస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. నాగా స్టైల్ మిక్స్డ్ వెజిటబుల్: నాగాలాండ్ లోని ఏవో గిరిజన తెగకు చెందిన ప్రత్యేక వంటకమిది. వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చిలను మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద పాత్రలో పొట్లకాయ ముక్కలు, వంకాయ, ఆకుకూరలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూరగాయలు వేసిన పాత్రలో వేసి బాగా ఉడికించండి. ఆ తర్వాత చల్లారే వరకూ ఆగి అందరికీ వడ్డించండి.
నాగాలాండ్ స్పెషల్ రెసిపీస్
అకిబెయె: కొంచెం చిక్కగా ఉండే ఈ కూరను చేయడం చాలా ఈజీ. చామదుంపలను ప్రెషర్ కుక్కర్ లో వేసి మెత్తగా మారేంతవరకు బాగా ఉడికించాలి. ఆ తర్వాత ఆవాలను, ఉప్పును వేసి 3నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు చామదుంపలను నలగ్గొట్టి బాగా కలపాలి. అంతే, అన్నం అంచుకు కూరలా వేసుకుని తినడమే. గుమ్మడి ఓంబాల్: నాగాలాండ్ లో ఇది చాలా ఫేమస్. పచ్చడి లాగా ఉండే ఈ గుమ్మడి ఓంబాల్, తియ్యగా పుల్లగా ఉంటుంది. ఉడకబెట్టిన గుమ్మడిని, చింతపండు కలిపిన నీళ్ళలో కలపాలి. ఇప్పుడు ఆవాలను నూనెలో వేయించి, బిర్యానీ ఆకు, ఎండు మిరపకాయలు, ఎండుద్రాక్ష వేసి బాగా వేయించాలి. తర్వాత గుమ్మడి, చింతపండు మిశ్రమాన్ని కలిపేసి వండాలి. బెల్లం కలుపుకుని ఉడకబెట్టి తినడమే.