ఎలాంటి వ్యసనం నుండైనా దూరం కావాలంటే చేయాల్సిన పనులు
ఏ అలవాటుకైనా వ్యసనంగా మారితే దాని నుండి తప్పించుకోవడం కష్టమవుతుంది. ముందు అలవాటు రూపంలో మీరు దాన్ని పట్టుకుంటారు. ఆ తర్వాత వ్యసనం రూపంలో అది మిమ్మల్ని వదిలిపెట్టదు. మందు తాగడం, సిగరెట్ తాగడం, అశ్లీల వీడియోలు చూడటం మొదలగు అనేక రకాల వ్యసనాలు మనుషులను వేధిస్తున్నాయి. మరి వీటి నుండి ఎలా బయటపడాలి? దానికోసం ఏం చేయాలో చూద్దాం. నిర్ణయం తీసుకోండి: వ్యసనాన్ని వదులుకోవాలని గట్టి నిర్ణయం తీసుకోండి. తుమ్మితే తుడిచి పెట్టుకుపోయేలా ఉండకుండా నిర్ణయం గట్టిగా ఉండాలి. ఏం చేస్తే వ్యసనం నుండి బయటపడతారో అవన్నీ సిద్ధం చేసుకోండి. మీ వాతావరణం మార్చుకోండి: ఉదహరణకు మీరు మందు తాగొద్దని అనుకుంటున్నారు. అలాంటప్పుడు మందు తాగే స్నేహితులతో కాలం గడపవద్దు.
వ్యసనం దూరం కావాలంటే చేయాల్సిన పనులు
బిజీగా ఉండండి: ఖాళీ టైమ్ దొరికితే వ్యసనం గుర్తొస్తుంటుంది. అందుకే మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఏదో ఒక పనిలో మునిగిపోండి. ఐతే మీకు ఎక్కువ తినడం వ్యసనంగా ఉందనుకోండి, దాన్నుండి బయటపడాలని వండే పనిలో బిజీ అవ్వకుండా జిమ్ కి వెళ్ళాలి. మీకు సాయం చేసే వారిని కనుక్కోండి: మీరు వ్యసనం నుండి దూరం అవ్వాలనుకుంటున్నట్లు మీ కుటుంబంతో చెప్పండి. దానిలో వాళ్ళ సాయం తీసుకోండి. మీ వ్యసనాన్ని దూరం చేసుకోవడంలో కుటుంబం మొత్తం మీ వెనక ఉందన్న అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. మిమ్మల్ని మీరు నమ్మండి: వ్యసనం అంత ఈజీగా పోదు. ఆశలు వదులుకోకండి. మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఖచ్చితంగా వ్యసనాన్ని దూరం చేసుకోవడంలో సక్సెస్ అవుతారు.