Foods for Mood: ఉదయాన్నే డల్ గా అనిపిస్తే.. ఈ ఆహారాలు మీ మూడ్‍ను ఇట్టే మార్చేస్తాయి!
కొన్నిసార్లు మనసు సంతోషంగా ఉండదు. ఏదో బాధగా, దిగులుగా అనిపిస్తుంది. దీనికి విభిన్న కారణాలు ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో చిన్న విషయాల వల్ల కూడా మనసు తీవ్రంగా ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఉదయపు సమయాల్లో, మూడ్ సరిగా లేకపోవడం చాలా మందిలో కనిపిస్తుంది. అయితే, కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తినడం ద్వారా మూడ్ మెరుగుపరుచుకోవచ్చు. ఇవి శరీరానికి ఉత్సాహాన్ని, మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. ఇలాంటి ఆరు ఆహారాలను తెలుసుకుందాం.
1. డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్, పోలీఫెనోల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తిని పెంచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. డార్క్ చాక్లెట్ నేరుగా తినవచ్చు లేదా ఓట్స్, కాఫీ, డ్రింక్స్ వంటి వాటిలో కలిపి తీసుకోవచ్చు. ఇది మూడ్‌ని వెంటనే హ్యాపీగా మార్చగలదు. 2. నట్స్, విత్తనాలు బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు, గుమ్మడి విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాల్లో ప్రోటీన్లు, అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో సెరటోనిన్ స్థాయిని పెంచుతాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో శరీరానికి చాలా మేలు చేస్తాయి. మూడ్ సరిచేసుకునేందుకు ఇవి ఉత్తమమైన ఎంపిక.
3. అరటి పండు
అరటిలో విటమిన్ బీ6 అధికంగా ఉంటుంది, ఇది డొపమైన్, సెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా, శరీరం ఉల్లాసంగా మరియు కడుపు తేలికగా అనిపిస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండే అరటి, ఆరోగ్యానికి కూడా మంచిది. 4. ఓట్స్ ఓట్స్‌లో పుష్కలమైన ఫైబర్ ఉంటుంది. ఇవి ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి తగినంత శక్తిని అందించి, నీరసం మరియు బద్దకాన్ని తగ్గిస్తాయి. చురుగ్గా అనిపించేందుకు మరియు మూడ్‌ను సక్రమంగా మార్చుకునేందుకు ఓట్స్ అనువైన ఆహారం. 5. ఫ్యాటీ ఫిష్ సాల్మోన్, టునా వంటి ఫ్యాటీ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆందోళన స్థాయిని తగ్గించడంతో పాటు, శరీరానికి ప్రశాంతతను అందిస్తాయి. మూడ్ మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
6. బెర్రీలు
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ వంటి బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు మరియు ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో శరీరానికి తగిన పోషకాలు అందుతాయి. మూడ్ మెరుగుపరిచే ఆహారాలను సరైన సమయంలో తీసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ఇవి మీ రోజువారీ జీవనశైలిలో భాగంగా చేసుకోండి, సంతోషంగా ఉండండి.