Clay Pot Lassi: మండే ఎండల్లో హాట్ ఫేవరెట్.. కుండ లస్సీకి పెరుగుతున్న డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
రోజురోజుకీ ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఉపశమనం కోసం చల్లని పానీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. మండే వేసవిలో దాహార్తిని తీర్చేందుకు పలు చోట్ల కూల్‌డ్రింక్స్, చెరుకురసం, పండ్ల రసాల దుకాణాలు విస్తరిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈసారి ప్రత్యేకంగా 'కుండ లస్సీ' ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి చల్లదనం, శక్తిని అందించే ఈ లస్సీకి మంచి ఆదరణ లభిస్తోంది. మార్చి ప్రారంభం నుంచే ఆదిలాబాద్‌లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత ఇప్పటికే 39డిగ్రీల సెల్సియస్ దాటడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 10గంటలకే బయటకు వెళ్లడానికే వెనుకాడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అవసరాల కోసం బయటకు వెళ్లే వారు చల్లని పానీయాల కోసం దుకాణాలను ఆశ్రయిస్తున్నారు.
Details
కొందరు యువకులకు ఉపాధి అవకాశాలు
కొబ్బరి బొండాలు, చెరుకు రసం వంటి సాధారణ దుకాణాలు ఉన్నప్పటికీ, ఈసారి కొత్తగా వచ్చిన కుండ లస్సీకి ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. ఈ లస్సీ దాహార్తిని తీర్చడమే కాకుండా కొందరు యువకులకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, కలెక్టర్ కార్యాలయం రోడ్డులో గత కొద్ది రోజులుగా ఈ కుండ లస్సీ దుకాణాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆర్భాటం లేకుండా రోడ్డు పక్కన చెట్ల కింద ఒక టేబుల్, ఐస్‌బాక్స్ ఏర్పాటు చేసి యువకులు ఈ లస్సీని విక్రయిస్తున్నారు. దస్నాపూర్‌లో కుండ లస్సీ ధర అక్కడే తాగితే రూ.40, పార్శిల్ అయితే రూ.50గా ఉంది
Details
ఆరోగ్యానికి మేలు
కలెక్టర్ కార్యాలయం రోడ్డులో మాత్రం అక్కడే తాగితే రూ.50, పార్శిల్‌కు రూ.60గా విక్రయిస్తున్నారు. తయారీ విధానం కూడా ప్రత్యేకమే. పెరుగును పలుచటి మజ్జిగలా చేసి, స్థానిక కుమ్మరుల నుంచి తెచ్చిన మట్టి కుండల్లో పోసి ఐస్‌బాక్స్‌లో చల్లగా ఉంచుతున్నారు. రుచిని పెంచేందుకు కోవా, బాదం, జీడిపప్పు ముక్కలు, పంచదారతో పాటు శరీరానికి చల్లదనం ఇచ్చే సబ్జ గింజలను కూడా కలుపుతున్నారు. ఈ విధంగా ఇంటి వద్దే తయారు చేసి కుండల్లో ప్యాక్ చేసి తీసుకువచ్చి, అక్కడికక్కడే మిశ్రమం కలిపి అందిస్తున్నారు.
Details
శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది
రసాయనాలు లేకుండా స్వచ్ఛమైన పెరుగుతో తయారవుతున్న ఈ లస్సీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. వేసవిలో శరీరానికి చల్లదనం ఇవ్వడంలో ఇది ఉపయోగపడుతుందని స్థానికులు భావిస్తున్నారు. రోజుకు 100 నుంచి 200 కుండల వరకు అమ్ముడవుతున్నట్లు విక్రేతలు తెలిపారు. మొత్తంగా కొత్తగా వచ్చిన ఈ కుండ లస్సీ ప్రజల దాహాన్ని తీర్చడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలను కూడా అందిస్తోంది.