LOADING...
Kakati village: ఊరుగా మారిన ఇల్లు
ఊరుగా మారిన ఇల్లు

Kakati village: ఊరుగా మారిన ఇల్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2026
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు ఒక ఊరు ఉంది... కానీ అది సాధారణ ఊరు కాదు. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్నది కేవలం ఒక్క ఇల్లు మాత్రమే! వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నూటికి నూరు శాతం నిజం. హిమాచల్‌ ప్రదేశ్‌లోని లాహౌల్‌-స్పీతి జిల్లా, కాజా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాకతీ అనే గ్రామం ప్రపంచానికి ఇదే ప్రత్యేకతను చూపిస్తోంది. ఈ గ్రామం నలువైపులా ఎత్తైన పర్వతాలతో చుట్టుముట్టబడి ఉంటుంది. పర్వతాల అడుగున కూరగాయల తోటలు, చిన్న చిన్న చెట్లు కనిపిస్తాయి. అవే సహజ రక్షణ కవచంలా ఈ గ్రామాన్ని కాపాడుతున్నాయి. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ ఒక్క ఇంట్లో నివసించే వారు వ్యవసాయం చేస్తూ, పశుసంపద ఆధారంగా జీవనం సాగిస్తున్నారు.

Details

మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి

కాకతీ గ్రామంలోని ఆ ఏకైక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్నారు. వారిలో ఒకరైన కల్జాంగ్ తప్కా బౌద్ధ లామాగా సేవలందిస్తున్నారు. ఆయన కాజా ప్రాంతంలో ధార్మిక సేవలు చేస్తుంటారు. మరో సోదరుడు సెరింగ్ నమ్‌గ్యాల్ తన భార్యతో కలిసి అదే ఇంట్లో నివసిస్తూ, సుమారు 15 బిగాల పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. లాహౌల్‌-స్పీతి జిల్లాలో శీతాకాలం ప్రారంభమైతే మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 30 డిగ్రీల వరకు పడిపోతాయి.

Details

కాకతీ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు

ఇలాంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా అక్కడి ప్రజల్లో చాలామంది కుల్లు-మనాలి, మండీ వంటి ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అయితే సెరింగ్ నమ్‌గ్యాల్ కుటుంబం మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. ఎంత కఠిన పరిస్థితులైనా సరే, తమ గ్రామాన్ని వదలకుండా అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది. అంతటి దూరప్రాంతమైన కాకతీ గ్రామానికి 2011 సంవత్సరంలో విద్యుత్తు సౌకర్యం, రోడ్డు సదుపాయం అందుబాటులోకి రావడం విశేషం. ఒక్క ఇల్లు మాత్రమే ఉన్నా, అపూర్వమైన జీవనశైలితో కాకతీ గ్రామం ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.

Advertisement