Kiwi fruit: మానసిక ఉల్లాసానికి సహజ మార్గం.. 'కివీ' పండు
ఈ వార్తాకథనం ఏంటి
దిగులు, నిరాశతో బాధపడేవారు ఉల్లాసం పొందాలనుకుంటే కివీ పండును ఆహారంలో చేర్చుకుని చూడాలని తాజా అధ్యయనం సూచిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే కివీ మానసిక స్థితిని, ప్రాణశక్తిని మెరుగుపరుస్తుందని ఈ పరిశోధన వెల్లడించింది. చిన్న ఆహార మార్పులతో కూడా మూడ్‌ను పెంచుకోవచ్చని ఇది స్పష్టంగా నిరూపిస్తుండటం విశేషం. సాధారణంగా విటమిన్ సి మానసిక స్థితిని, శక్తిని, మొత్తం ఆరోగ్యాన్ని ఉత్తేజితం చేస్తుంది. దిగులు, నిరాశ భావాలను తగ్గించడంలో దీని పాత్ర ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో విటమిన్ సి లేదా దానితో కూడిన పదార్థాలు ఎంత త్వరగా సానుకూల ప్రభావం చూపుతాయో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రత్యేక అధ్యయనం చేపట్టారు.
Details
రోజుకు రెండు కివీ పండ్లు తినాలి
విటమిన్ సి లోపం ఉన్నవారిని ఎంపిక చేసి, వారిని మూడు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్‌కు విటమిన్ సి మాత్రలు ఇవ్వగా, రెండో గ్రూప్‌కు ఉత్తుత్తి మాత్రలు (ప్లాసీబో) అందించారు. మూడో గ్రూప్‌లో ఉన్నవారికి రోజుకు రెండు కివీ పండ్లు తినాలని సూచించారు. ఎనిమిది వారాల పాటు వీరిని గమనించి, ఫలితాలను విశ్లేషించారు. ఫలితాల ప్రకారం, కివీ పండ్లు తీసుకున్నవారిలో నాలుగు రోజుల్లోనే మూడ్, ప్రాణశక్తి మెరుగుపడటం ప్రారంభమైంది. 14 నుంచి 16 రోజుల్లో ఈ మార్పులు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అయితే విటమిన్ సి మాత్రలు తీసుకున్నవారిలో మాత్రం 12 రోజుల వరకు స్పష్టమైన ప్రభావం కనిపించలేదని పరిశోధకులు వెల్లడించారు.
Details
విటమిన్ సి ఆహార పదార్థాలను తీసుకోవాలి
ఈ అధ్యయనం మాత్రల రూపంలో విటమిన్ సి తీసుకోవడానికంటే, సహజంగా విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం మరింత ప్రయోజనకరమని సూచిస్తోంది. అందుకే పోషణ, ఆరోగ్యం విషయంలో ఒకే పోషకంపై ఆధారపడకుండా సమగ్ర విధానాన్ని అవలంబించాలన్నారు. వివిధ పోషకాలు కలిగిన ఆహారాలను రోజువారీ భోజనంలో భాగం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.