Gandikota: దేవుడు లేని గుడి.. గండికోటలో ఆలయం, మైదుకూరులో దైవం!
ఈ వార్తాకథనం ఏంటి
మైదుకూరులో కొలువైన శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామికి, గండికోటలోని మాధవరాయ స్వామికి మధ్య గాఢమైన చారిత్రక బంధం ఉందని స్థానిక చరిత్ర చెబుతోంది. 11వ శతాబ్దంలో కాకరాజు గండికోటకు పునాదులు వేసినట్లు చరిత్రలో ప్రస్తావన ఉంది. అనంతరం 16వ శతాబ్దంలో పెమ్మసాని రామలింగ నాయుడు గండికోటలో మాధవరాయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. 1652లో గోల్కొండ నవాబు కుతుబ్ షాహీ సైన్యాధికారి మీర్ జుమ్లా గండికోటపై దాడికి దిగారు. ఈ దాడి విషయం ముందుగానే తెలుసుకున్న అప్పటి పాలకులు, గండికోట ఆలయంలోని మాధవరాయ స్వామి విగ్రహాన్ని రక్షించేందుకు మైదుకూరుకు తరలించి, పాతూరులోని ఒక బావిలో దాచినట్లు ప్రచారం ఉంది.
Details
సంపదను దోచుకెళ్లారు
దాదాపు 310 ఏళ్ల క్రితం ఆ బావి నుంచి విగ్రహాన్ని వెలికితీసి మైదుకూరులో ప్రతిష్ఠించారని, అప్పటి నుంచే స్వామి అక్కడ పూజలందుకుంటున్నారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి మరో కథ కూడా ఉంది. నవాబుల కాలంలో హిందూ ఆలయాలపై విధ్వంసం సాగిన సమయంలో, గండికోట ఆలయంలోకి చొరబడి సంపదను దోచుకునే ప్రయత్నాలు జరిగాయని చరిత్రకారులు చెబుతారు. గర్భగుడి ద్వారాలు పగులగొట్టేందుకు యత్నించిన ఆ దారుణాలను తట్టుకోలేక, శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి గర్భగుడి వెనుక భాగంలో రంధ్రం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి మాండవ్య క్షేత్రమైన మైదుకూరులోని ఒక 'సెలిమె'లో వెలిశారని ప్రతీతి. ఆ సెలిమేనే నేటి మైదుకూరులోని పాత ఊరులో ఉన్న పెద్దబావిగా చెబుతారు.
Details
భక్తుల నమ్మకం ఇదే
గండికోట దుర్గం నుంచి మైదుకూరు పెద్దబావి వరకు సొరంగమార్గం ఇప్పటికీ ఉందని చరిత్రకారుల అభిప్రాయం. జిల్లేడు, నల్లేరు చెట్లు, పొదలతో నిండిన ఆ ప్రాంతంలో ఒక మేకల కాపరి మేకలను మేపుకుంటూ వచ్చేవాడట. అతడి మందలోని ఒక మేక ప్రతిరోజూ సెలిమె దగ్గరకు వచ్చి నీరు తాగి, అనంతరం తన పాలను స్వామికి అర్పించేదని కథనం. ఇలా ప్రతిరోజూ జరుగుతుండగా, ఒక రోజు ఆ మేక యజమాని ఇది గమనించి ఆగ్రహంతో కర్రతో కొట్టబోయాడట. అయితే ఆ కర్ర మేకకు కాకుండా స్వామి వారికే తగిలిందని, దాంతో స్వామి నుదిటిపై గాయం అయిందని చెబుతారు. ఆ గాయపు మచ్చ ఇప్పటికీ స్వామి వారి నుదిటిపై కనిపిస్తుందని భక్తుల నమ్మకం.
Details
సంతానం లేనివారికి సంతాన భాగ్యం
అప్పుడే స్వామి స్వయంగా మాట్లాడి, "మూర్ఖుడా, నేనెవరినని అనుకుంటున్నావు? గండికోట నుంచి వచ్చిన మాధవరాయ స్వామిని" అన్నట్లుగా పలికినట్లు కథనం. ఈ విషయం ఊరంతా వ్యాపించడంతో, గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి స్వామిని గుర్తించి బయటకు తీసి తక్షణమే ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చేసి పూజలు ప్రారంభించారు. ప్రత్యేకంగా ధనుర్మాసంలో స్వామి వారికి పెద్దబావి నీటితో అభిషేకాలు చేస్తారు. భక్తులు కూడా అదే నీటితో స్నానం చేసి ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకునేవారని చెబుతారు. ఈ విధంగా స్వామి భక్తుల కోరికలు తీర్చుతూ, సంతానం లేనివారికి సంతాన భాగ్యం కలిగించేవారని విశ్వాసం.
Details
రోజుకో ఒక పల్లెల్లో ఊరేగింపు
అప్పట్లో స్వామి అనుగ్రహంతో పుట్టిన పిల్లలకు స్వామి పేర్లు పెట్టుకునే ఆనవాయితీ ఉండేదని, ఇప్పటికీ మైదుకూరులో అలాంటి పేర్లు కలిగిన భక్తులు ఉన్నారని స్థానికులు చెబుతారు. గండికోట ఆలయంలో గర్భగుడి రంధ్రం వద్ద 'తూటు వేసుకొని స్వామి తొలగిపోయె' అనే శాసనం ఇప్పటికీ కనిపిస్తుందని సమాచారం. ఆలయం నిర్మించిన సంక్రాంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా కనుమ రోజున జరిగే పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కళాకారుల నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, డప్పు మేళతాళాల మధ్య స్వామి వారిని 16 పల్లెల్లో రోజుకో గ్రామంలో ఊరేగిస్తారు. స్వామి ఊరేగింపుగా వచ్చిన రోజంతా ఆయా గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు ఆకాశాన్నంటుతాయని భక్తులు ఆనందంగా చెబుతారు.