LOADING...
Women and Heart Disease Risk: పురుషులకంటే మహిళల్లో గుండె జబ్బుల ముప్పు తక్కువేనా? నిపుణుల మాట ఇదే!
పురుషులకంటే మహిళల్లో గుండె జబ్బుల ముప్పు తక్కువేనా? నిపుణుల మాట ఇదే!

Women and Heart Disease Risk: పురుషులకంటే మహిళల్లో గుండె జబ్బుల ముప్పు తక్కువేనా? నిపుణుల మాట ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2025
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె జబ్బుల ముప్పు కొంత తక్కువగా ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా మెనోపాజ్‌కు ముందు మహిళల శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ గుండెను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ (LDL) స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే యువ వయస్సులో మహిళల్లో గుండె సంబంధిత సమస్యలు తక్కువగా కనిపిస్తాయి. అయితే మెనోపాజ్‌ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి గణనీయంగా తగ్గిపోవడంతో మహిళల్లో కూడా గుండె జబ్బుల ప్రమాదం క్రమంగా పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Details

గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం

ఈ దశలో ఒత్తిడి, మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి జీవనశైలి అంశాలు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని సూచిస్తున్నారు. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి మహిళ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అలాగే నిరంతర వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నెలసరి ఆగిన తర్వాత మహిళల్లో గుండెపోటు లక్షణాలు పురుషులకంటే భిన్నంగా ఉండొచ్చని నిపుణులు వెల్లడించారు. ఛాతీ నొప్పి మాత్రమే కాకుండా, కారణం తెలియని తీవ్రమైన నిస్సత్తువ, తల తిరగడం, కడుపు నొప్పి, మెడ, భుజాలు, వీపు భాగాల్లో నొప్పులు వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.

Details

నిర్లక్ష్యం చేయకూడదు

కొన్నిసార్లు కేవలం ఆయాసం మాత్రమే ఉండటం లేదా సరైన కారణం లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం కూడా గుండెపోటు సంకేతాలుగా ఉండవచ్చని వారు చెబుతున్నారు. ఈ లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా కీలకం. గుండెపోటు వచ్చినప్పుడు చాలామంది భయాందోళనకు లోనవుతారు. కానీ ఆ సమయంలో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వీలైనంత త్వరగా చికిత్స అందించడం అత్యంత ముఖ్యం.

Advertisement

Details

సూమారు 5 నుంచి 10శాతం వరకు ఉంటుంది

అధ్యయనాల ప్రకారం, ప్రతి సంవత్సరం గుండెపోటుతో మరణించే వారి శాతం సుమారు 5 నుంచి 10 శాతం వరకు ఉంటుందని వెల్లడైంది. గుండెపోటు వచ్చిన వెంటనే 'గోల్డెన్ అవర్'లో చికిత్స అందిస్తే బతికే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సీపీఆర్‌ (CPR) చేయడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడే అవకాశాలు మరింత పెరుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement