Fingers Swelling : చలి దెబ్బకు వేళ్లు ఉబ్బుతున్నాయా..? నిపుణుల సూచనలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలం మొదలైంది. వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయంత్రం త్వరగానే చీకటి కమ్మేస్తోంది. ఉదయం, సాయంత్రం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చల్లని గాలులు పెరిగిపోతున్నాయి. ఈ వాతావరణ మార్పులు శరీరంపై కూడా అనేక ప్రభావాలు చూపిస్తాయి. చలి మొదలైన వెంటనే రోగనిరోధక శక్తి తగ్గిపోవడం నుంచి పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటిలో చాలా మందిని వేధించే సమస్య చేతులు, కాళ్లు ముడుచుకుపోవడం లేదా వేళ్లు ఉబ్బడం. ఈ సమయంలో వేళ్లలో వాపు, దురద, నొప్పి వంటి సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి.
Details
చలి వల్ల శరీరంపై ప్రభావం
వైద్య నిపుణుల ప్రకారం చల్లని వాతావరణం రక్త ప్రసరణపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఉష్ణోగ్రత తగ్గిపోతే రక్త సిరలు కుంచించుకుపోతాయి. దీంతో రక్తప్రసరణ మందగిస్తుంది, కొన్నిసార్లు రక్తం గడ్డకట్టే అవకాశం కూడా ఉంటుంది. దాంతో చేతులు, కాళ్ల వేళ్లు ఎర్రగా లేదా నీలంగా మారిపోతాయి. చల్లని ఉష్ణోగ్రతల్లో ఎక్కువసేపు గడపడం వల్ల వేళ్లలో వాపు, దురద పెరుగుతుంది. ఈ వాపు క్రమంగా నొప్పిగా మారి రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది కలిగిస్తుంది.
Details
మహిళల్లో ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది?
పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కారణం - మహిళలు రోజంతా వంటగదిలో, నీటికి సంబంధించిన పనుల్లో ఎక్కువగా ఉంటారు. చల్లటి నీరు తరచుగా తాకడం వల్ల చేతుల చర్మం ముడుచుకుపోతుంది, రక్త ప్రవాహం తగ్గుతుంది. ఫలితంగా వేళ్లలో వాపు, దురద, నొప్పి వంటి లక్షణాలు మరింతగా కనిపిస్తాయి.
Details
చేతులు, కాళ్ల వేళ్లు ఉబ్బితే చేయాల్సినవి
ఈ సమస్య ఎదురైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. వేళ్ల వాపును తగ్గించడానికి చేతులు, కాళ్లను వెచ్చని దుస్తులతో కప్పుకోవాలి. అయితే హీటర్ లేదా మంట దగ్గర నేరుగా వేడి చేయడం పూర్తిగా తప్పు. ఇది చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. బదులుగా శరీర ఉష్ణోగ్రతను నెమ్మదిగా సాధారణ స్థాయికి తీసుకురావడం ఉత్తమం. అలా చేస్తే వాపు, దురద సహజంగా తగ్గిపోతాయి. అయితే సమస్యను తేలికగా తీసుకోవడం సరైంది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రారంభంలో చిన్న సమస్యలా అనిపించినా, దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే చేతులు, కాళ్ల వేళ్లలో వాపు, నొప్పి పెరిగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.