Medaram Jatara 2026: ఆదివాసీ వీరత్వానికి ప్రతీక మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర..
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో నిర్వహించే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆదివాసీ జాతరగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు విశేష గుర్తింపు ఉంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాజాతర ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు కొనసాగనుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి దాదాపు కోటిన్నర మందికి పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ జాతర ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది.
వివరాలు
చరిత్రలో మొదటి ప్రతాపరుద్రుడి దండయాత్రతో జాతర ప్రాధాన్యం పెరిగింది
మేడారం జాతరకు ఈ స్థాయి ఖ్యాతి రావడానికి గల నేపథ్యం, ఆలయ విశిష్టతపై దృష్టి సారిస్తే పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయి. 12వ శతాబ్దంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించిన ఆదివాసీ దొర మేడరాజుకు సమ్మక్క అనే ఏకైక కుమార్తె ఉండేది. మేడరాజు తన కుమార్తె సమ్మక్కను మేనల్లుడు, మేడారం పాలకుడు అయిన పగిడిద్దరాజుకు వివాహం చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, జంపన్న అనే ఇద్దరు సంతానం జన్మించారు. కాకతీయులకు ఏటా చెల్లించాల్సిన కప్పం చెల్లించలేదనే కారణంతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆ దాడిని ఎదుర్కోలేక మేడరాజు మేడారానికి వెళ్లి అజ్ఞాతవాసంలో గడిపాడు.
వివరాలు
చరిత్రలో మొదటి ప్రతాపరుద్రుడి దండయాత్రతో జాతర ప్రాధాన్యం పెరిగింది
మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడిగా ఉండి, కరువు కాటకాల కారణంగా కప్పం చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నాడు. కప్పం చెల్లించకపోవడం, మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం, కోయ ఆదివాసీల సార్వభౌమత్వాన్ని కాపాడాలనే భావజాలాన్ని బలపరచడం, రాజ్యాధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడన్న ఆరోపణలతో ప్రతాపరుద్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో తన ప్రధానమంత్రి యుగంధరుడితో కలిసి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై సైనిక దాడికి దిగాడు.
వివరాలు
కుటుంబ సమేతంగా సమ్మక్క-సారలమ్మల వీరోచిత పోరాటం
సాంప్రదాయ ఆయుధాలతో యుద్ధానికి దిగిన పగిడిద్దరాజు, నమ్మక్క, సారలమ్మ, జంపన్న, గోవిందరాజులు అపూర్వ ధైర్యంతో పోరాడారు. అయితే సుశిక్షితులైన అపార కాకతీయ సేనల దాడికి తట్టుకోలేక పగిడిద్దరాజు,సారలమ్మ,నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధభూమిలో వీరమరణం పొందారు. ఈ పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని భరించలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగ వాగు 'జంపన్న వాగు'గా ప్రసిద్ధి చెందింది. ఇదిలా ఉండగా, యుద్ధభూమిలో సమ్మక్క ఒంటరిగా కాకతీయ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టింది. ఆదివాసీ మహిళ ప్రదర్శించిన యుద్ధ నైపుణ్యాన్ని చూసి ప్రతాపరుద్రుడు కూడా ఆశ్చర్యానికి గురయ్యాడని చరిత్ర చెబుతోంది.
వివరాలు
కుటుంబ సమేతంగా సమ్మక్క-సారలమ్మల వీరోచిత పోరాటం
చివరికి కాకతీయ సైన్యం వెనుక నుంచి బరిసెతో దాడి చేయడంతో సమ్మక్క తీవ్రంగా గాయపడింది. రక్తస్రావంతోనే యుద్ధభూమిని విడిచి చిలుకల గుట్ట వైపు వెళ్లిన ఆమె మార్గమధ్యంలో అదృశ్యమైంది. సమ్మక్క కోసం వెతికిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. అయితే ఆ ప్రాంతంలోని ఒక పుట్ట దగ్గర పసుపు-కుంకుమలతో కూడిన కుంకుమ భరణం లభించింది. దానినే సమ్మక్కగా భావించి, అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు.
వివరాలు
2026 మేడారం జాతర తేదీలు, ప్రత్యేకతలు
2026 సంవత్సరానికి గాను మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరుగనుంది. జాతర తొలి రోజైన జనవరి 28న కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. అదే రోజు కొండాయి నుంచి గోవిందరాజులను, పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజులను గద్దెలపై ప్రతిష్టింపజేస్తారు. రెండో రోజు జనవరి 29న చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను పూజారులు తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు.
వివరాలు
ఆదివాసులే ఈ జాతర పూజారులుగా..
మూడో రోజు శుక్రవారం పూర్తిస్థాయిలో భక్తులు మొక్కులు చెల్లిస్తారు. నాలుగో రోజు సాయంత్రం దేవతలను తిరిగి వనప్రవేశం చేయడం ఆనవాయితీ. వంశపారంపర్యంగా వస్తున్న ఆదివాసులే ఈ జాతర పూజారులుగా వ్యవహరించడం, పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారమే కార్యక్రమాలు సాగడం ఈ జాతర ప్రత్యేకతగా నిలుస్తోంది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుతూ అమ్మవార్లకు బెల్లం రూపంలో బంగారం నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయం.