LOADING...
Australia: అరుపులో ఆస్ట్రేలియన్‌ సత్తా.. 122.4 డెసిబెల్స్‌తో గిన్నిస్‌ రికార్డ్

Australia: అరుపులో ఆస్ట్రేలియన్‌ సత్తా.. 122.4 డెసిబెల్స్‌తో గిన్నిస్‌ రికార్డ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

జెట్‌ విమానం గర్జన, అంబులెన్స్‌ సైరన్‌ శబ్దం కూడా ఆయన గొంతు ముందు చిన్నబోయాయి. ఆస్ట్రేలియా రాజధాని Canberraకు చెందిన 58 ఏళ్ల జోసెఫ్‌ మెక్‌గ్రెయిల్‌ బాటప్‌ ప్రపంచంలోనే అత్యంత గట్టిగా అరచిన వ్యక్తిగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఆయన 'నౌ' అనే ఒక్క మాటను గట్టిగా పలకగా,అది 122.4 డెసిబెల్స్‌గా నమోదై కొత్త ప్రపంచ రికార్డుగా నిలిచింది. 32 ఏళ్ల రికార్డుకు చెక్‌ ఈ విభాగంలో గత రికార్డు ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన స్కూల్‌ టీచర్‌ అన్నాలిసా ఫ్లానగన్‌ పేరిట ఉండేది. ఆమె 1994లో 'క్వైట్‌' అని 121.7 డెసిబెల్స్‌ శబ్దంతో అరిచి రికార్డు నెలకొల్పారు. తాజాగా జోసెఫ్‌ మెక్‌గ్రెయిల్‌ ఆ మార్కును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించారు.

వివరాలు 

రెండు రోజుల పాటు నా గొంతు పూర్తిగా పడిపోయింది: జోసెఫ్

అయితే,ఈ విజయంపై జోసెఫ్‌ ఎంతో వినయంగా స్పందించారు. 'ఆమె సాధించిన రికార్డు ఆమెదే.ఇప్పుడు ఆమె ప్రపంచంలోనే అత్యంత గట్టిగా అరిచిన మహిళ కాగా, నేను అత్యంత గట్టిగా అరిచిన పురుషుడిని' అని వ్యాఖ్యానించారు. ఈ రికార్డు కోసం ప్రత్యేకంగా సాధన చేయడం సాధ్యం కాదని జోసెఫ్‌ తెలిపారు. 'ఆ ఒక్క పదాన్ని సరైన స్థాయిలో అరవడానికి నేను ఏడు సార్లు ప్రయత్నించాల్సి వచ్చింది. అనంతరం రెండు రోజుల పాటు నా గొంతు పూర్తిగా పడిపోయింది. మాట్లాడటానికే ఇబ్బంది పడ్డాను' అని వెల్లడించారు. మే 2న ఒక రేడియో స్టూడియోలో ఎకౌస్టిక్‌ ఇంజనీర్‌ సమక్షంలో ఈ రికార్డు ప్రయత్నం నిర్వహించారు. అనంతరం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ దీనిని పరిశీలించి తాజాగా అధికారికంగా ధ్రువీకరించింది.

Advertisement