LOADING...
Lathmar Holi: బర్సానాలో రాధే-కృష్ణా నినాదాలతో మార్మోగిన లాఠ్‌మార్ హోలీ
బర్సానాలో రాధే-కృష్ణా నినాదాలతో మార్మోగిన లాఠ్‌మార్ హోలీ

Lathmar Holi: బర్సానాలో రాధే-కృష్ణా నినాదాలతో మార్మోగిన లాఠ్‌మార్ హోలీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బర్సానా పట్టణంలో లాఠ్‌మార్ హోలీ వేడుకలు రంగుల హోరుతో, భక్తి భావంతో ఘనంగా జరిగాయి. రాధాకృష్ణుల దివ్య ప్రేమకథకు ప్రతీకగా జరిగే ఈ వేడుకల్లో సంప్రదాయ వస్త్రాలు ధరించిన మహిళలు రంగుల్లో తడిసిన పురుషులను కర్రలతో సరదాగా కొడుతుంటే, వారు తోలు కవచాలతో తమను తాము రక్షించుకుంటూ నవ్వులు పూయించారు. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో బర్సానా వీధులన్నీ రంగుల తుఫాన్‌లా మారాయి. "రాధే-కృష్ణా" నినాదాలతో ఆ పట్టణం అంతా మార్మోగింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో నంద్‌గావ్‌కు చెందిన హురియార్లు బర్సానాకు చేరుకుని లాఠ్‌మార్ హోలీలో పాల్గొన్నారు.

వివరాలు 

హెలికాప్టర్ ద్వారా పూల వర్షం

ద్వాపర యుగంలో కృష్ణుడు తన స్నేహితులతో కలిసి బర్సానాకు వచ్చి రాధా, ఆమె సఖులను సరదాగా ఆటపట్టించగా వారు కర్రలతో తరిమిన ఘటన నుంచే ఈ సంప్రదాయం ప్రారంభమైందని స్థానికుల నమ్మకం. నంద్‌గావ్ నుంచి వచ్చిన వారికి ప్రియా కుండ్ వద్ద సంప్రదాయ స్వాగతం పలికి, స్వీట్లు, పకోడీలు, తండాయ్ వడ్డించారు. అనంతరం బ్రహ్మాంచల్ కొండపై ఉన్న శ్రీ లాడ్లీ కిశోరి జీ దేవాలయంలో అనుమతి తీసుకుని హోలీ ఆడారు. ఈసారి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'రంగోత్సవ్ 2026' పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించింది.

వివరాలు 

కట్టుదిట్టమైన భద్రత మధ్య బర్సానాలో హోలీ జోష్

బ్రజ్ ప్రాంతంలో బసంత్ పంచమి నుంచి సుమారు 45 రోజుల పాటు హోలీ వేడుకలు కొనసాగుతుండగా, అందులో లాఠ్‌మార్ హోలీనే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. భద్రతా చర్యల్లో భాగంగా దాదాపు 500 మంది పోలీసు అధికారులు, 4 వేల మంది సిబ్బందిని మోహరించారు. మొత్తం ప్రదేశాన్ని 8 జోన్లు, 14 సెక్టర్లుగా విభజించి పర్యవేక్షిస్తున్నారు. 150కి పైగా సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. అల్లరి మూకలను అదుపులో పెట్టేందుకు ప్రత్యేక బృందాలు కూడా పనిచేస్తున్నాయి. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వేడుకల ఏర్పాట్లను ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించారు.

Advertisement