Laknavaram Lake: పర్యాటకులను ఆకర్షిస్తున్న లక్నవరం సరస్సు.. మీరు ఓ లుక్కేయండి..
తెలంగాణ పర్యాటక క్షేత్రాలలో ఒక ముఖ్యమైన ప్రదేశం లక్నవరం సరస్సు.ఇది ములుగు జిల్లాలో గోవిందరావుపేట మండలంలో బుస్సాపూర్ శివారులో ఉంది. వరంగల్ సిటీ నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఈ సరస్సు ఉంటుంది. దట్టమైన అడవుల మధ్య కొండల నడుమ ఈ సరస్సు ఏర్పడింది. ఇది ప్రకృతి సౌందర్యాలకు నిలయంగా నిలుస్తుంది. లక్నవరం సరస్సు కాకతీయుల కాలం నాటిది.చరిత్ర ప్రకారం,ఈ సరస్సును కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తవ్వించాడు. ఈ సరస్సు చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున లక్నవరం వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు కోనసీమ, కేరళ, అరకు వంటి ప్రాంతాల అనుభూతి కలుగుతుంది. లక్నవరం సరస్సులో అనేక ద్వీపాలు ఉన్నాయి, ఇవి పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణలు.
రాత్రి బస కోసం కాటేజ్స్
ఈ సరస్సు మీదుగా వేసిన ఉయ్యాల వంతెన ఈ ప్రాంతంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వంతెనపై నడవడం అనుభవానికి వినూత్నం. వీకెండ్స్‌లో పర్యాటకులు ఈ వంతెనను చూడటానికి అధిక సంఖ్యలో వస్తారు. రెండు ఉయ్యాల వంతెనలు పర్యాటకులను పార్క్, హరిత హోటల్, బోటింగ్ స్పాట్‌లకు తీసుకెళ్తాయి. పర్యాటకులు బోటు షికారు, స్పీడ్ బోటు, సైక్లింగ్ బోట్లను ఆస్వాదించవచ్చు. అదనంగా, ఫోటో షూట్స్, అడ్వెంచర్ గేమ్స్, కాంప్ ఫైర్, రాత్రి బస, క్యాంపింగ్ లాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రాత్రి బస కోసం కాటేజ్స్ కూడా ఉన్నాయి, ఈ కాటేజ్స్ తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. పర్యాటకులు సాధారణంగా ఐలాండ్‌లో ఉన్న కాటేజ్స్‌లో ఉండడాన్ని ఇష్టపడతారు.
వీకెండ్స్‌లో పర్యాటకుల రద్దీ
వీటిలో ఏసీ, నాన్ ఏసీ గదులు అందుబాటులో ఉంటాయి. కాటేజీ బుకింగ్ కోసం ముందుగా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకోవాలి. లక్నవరం సరస్సులో సందర్శన సమయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. వంతెన పైకి ప్రవేశ రుసుము పెద్దలకు రూ.10, పిల్లలకు రూ.5 మాత్రమే. ఈ సరస్సును చూసేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. వీకెండ్స్‌లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, వారంతా ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సమయాన్ని ఆస్వాదిస్తారు. వెడ్డింగ్ షూట్‌లకు కూడా లక్నవరం సరస్సు ఒక అద్భుత ప్రదేశంగా భావించబడుతుంది. ఇక్కడ ఇప్పటికే పలు సినిమాలు కూడా చిత్రీకరించబడ్డాయి.