Belagavi woman: కలలు సాకారం చేసుకున్న మల్లవ్వ..
చిన్నప్పటి నుంచి మల్లవ్వ భీమప్పకు చదువు ఒక కలగా మిగిలింది. ఉద్యోగం సాధించడం ఇంకొక పెద్ద కల. కానీ, ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఈ రెండు కలల్ని సాకారం చేసుకోనివ్వలేదు. మల్లవ్వ పెద్దదైంది, ఊరికి సర్పంచ్‌గా కూడా పనిచేసింది. కానీ ఆమె కలలు ఇప్పటికీ కలలుగా మిగిలాయి. ఈ కలలను నిజం చేసుకునే నిర్ణయంతో, మల్లవ్వ అక్టోబర్ 13న ఊరిలో ఒక లైబ్రరీని ప్రారంభించింది. తనకు చదువుకోలేకపోవచ్చు, ఉద్యోగం చేయలేకపోవచ్చు కానీ, చదువుకునే పిల్లల కోసం, ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవాలనుకున్న యువతీయువకుల కోసం ఉపయోగపడే పుస్తకాలను లైబ్రరీలో అందుబాటులో ఉంచింది. ఇంకా కొన్ని పుస్తకాలను కూడా తెప్పించటానికి యోచిస్తున్నది.
లైబ్రరీ ఏర్పాటు 1.50లక్ష ఖర్చు
ఈ చర్య ద్వారా ఆమె వాటిలో తనను చూసుకుంటోంది. లైబ్రరీ ఏర్పాటు కోసం మల్లవ్వ ఖర్చు చేసిన 1.50 లక్షల రూపాయిలలో, గృహలక్ష్మి యోజన కింద ప్రభుత్వమే నెలకి అందిస్తున్న 2000 రూపాయలు దాచిపెట్టగా జమ అయిన 26 వేల రూపాయలు కూడా ఉన్నాయి. కల అంటే నిద్రలో రావడం కాదు, నిద్ర పోనివ్వకుండా చేయడం అనే మాట మల్లవ్వ విషయంలో నిజం అయింది. ఆమె ఈ విషయాన్ని రుజువ చేసింది.