ఆరోగ్యం: చర్మ సంరక్షణలో మాత్రమే కాకుండా కండరాల నొప్పిని దూరం చేసే పెప్పర్ మింట్ ఆయిల్
పెప్పర్ మెంట్ ఆయిల్.. చర్మ సంరక్షణలో దీని పాత్ర అధికంగా ఉంటుంది. చర్మానికి సరైన మెరుపు తీసుకురావడంలోనూ, మొటిమలను తగ్గించడంలో సాయపడుతుంది. ఐతే చర్మానికి మాత్రమే కాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని పంచడంలో పెప్పర్ మింట్ ఆయిల్ ముందంజలో ఉంటుంది. పెప్పర్ మింట్ ఆయిల్ శరీరానికి చేసే ప్రయోజనాలు. కండరాల నొప్పిని తగ్గిస్తుంది: జిమ్ లో బాగా కష్టపడి ఒళ్ళు నొప్పులు తెచ్చుకున్నా లేదా మీ పని కారణంగా రోజంతా ఒకేచోట కూర్చోవడం వల్ల కండరాల్లో నొప్పి కలిగినా.. పెప్పర్ మెంట్ ఆయిల్ సాయం చేస్తుంది. మీకు నొప్పిగా అనిపించిన ప్రాంతాల్లో పెప్పర్ మింట్ ఆయిల్ మర్దన చేస్తే క్షణాల్లోనే మంచి ఉపశమనం దొరుకుతుంది.
శరీరంలోని గ్యాస్ ని తగ్గించడంలో, గొంతునొప్పిని తగ్గించడంలో సాయపడే పెప్పర్ మింట్ ఆయిల్
గ్యాస్ ని తగ్గిస్తుంది: కడుపుబ్బరం చాలామందిలోనూ కనిపిస్తుంటుంది. కొంచెం తిన్నాకూడా ఉబ్బినట్లుగా అనిపిస్తుంటుంది. అదంతా గ్యాస్ మహిమ. ఈ గ్యాస్ ని తగ్గించాలంటే ఒక చిన్న గ్లాస్ లో నీళ్ళు తీసుకుని అందులో కొన్నిచుక్కల పెప్పర్ మింట్ ఆయిల్ ని కలుపుకునితాగితే గ్యాస్ తగ్గిపోతుంది. కడుపులో అస్వస్థత, వికారాన్ని తగ్గించడంలో పెప్పర్ మింట్ సాయపడుతుంది. గొంతునొప్పిని తగ్గిస్తుంది: గొంతునొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే దాన్నుండి తక్షణమే ఉపశమనం పొందాలనుకుంటే పెప్పర్ మింట్ ఆయిల్ పనిచేస్తుంది. గోరు వెచ్చని నీళ్ళలో కొన్ని చుక్కల పెప్పర్ మింట్ ఆయిల్ పోసుకుని తాగితే కొన్ని నిమిషాల్లోనే గొంతునొప్పి నుండి తాత్కాలిక రిలీఫ్ లభిస్తుంది. అందుకే ఈసారి చర్మానికే కాకుండా శరీరానికి కూడా పెప్పర్ మింట్ ఆయిల్ తెచ్చుకోండి.