Bittu Tabahi: 8 నెలల కష్టం వారం రోజుల్లోనే వృథా.. అజ్నార్ నది దుస్థితిపై బిట్టూ ఆవేదన
ఈ వార్తాకథనం ఏంటి
ఎనిమిది నెలల పాటు కష్టపడి నదిని శుభ్రం చేసిన ఓ యువకుడికి మళ్లీ నిరాశే ఎదురైంది. టన్నుల కొద్దీ చెత్తను తొలగించి నదికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రయత్నించినా, కొద్ది వారాల్లోనే పరిస్థితి మొదటికొచ్చింది. ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్థాలతో నది మళ్లీ కలుషితం కావడంతో మధ్యప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల బిట్టూ తబాహి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన బాధను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ, నదిని మరోసారి శుభ్రం చేస్తానని స్పష్టం చేశాడు.
వివరాలు
'ఎనిమిది నెలల కష్టం వృథా అవుతుందని ఊహించలేదు'
ఎంతో శ్రమించి శుభ్రం చేసిన నది మళ్లీ చెత్తతో నిండిపోవడాన్ని చూసి బిట్టూ భావోద్వేగానికి లోనయ్యాడు.
''నా ఎనిమిది నెలల కఠోర శ్రమ ఇలా వృథా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఈత రాదు. ప్రత్యేక పరికరాలు కూడా లేవు. అయినప్పటికీ ఎంతో కష్టపడి నదిని శుభ్రం చేశాను. కానీ ప్రజలు మళ్లీ చెత్తాచెదారాన్ని పడేసి నదిని కలుషితం చేశారు. అయినా నేను వెనక్కి తగ్గను. మరోసారి నదిని శుభ్రం చేస్తాను. ఈ పనిని త్వరగా పూర్తి చేయడానికి ఏం చేయాలో సలహాలు ఇవ్వండి'' అని నెటిజన్లను కోరాడు.
అజ్నార్ నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్థాలను బయటకు తీస్తున్న దృశ్యాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
వివరాలు
ఎనిమిది నెలల పాటు సాగిన శుభ్రత కార్యక్రమం
నదిని శుభ్రం చేయాలనే అతడి పట్టుదల, పర్యావరణంపై చూపిస్తున్న బాధ్యతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
అదే సమయంలో నదులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడేసే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బియోరా పట్టణానికి చెందిన సురేంద్ర సింగ్ చౌధరీనే బిట్టూ తబాహిగా గుర్తింపు పొందాడు.
ప్రస్తుతం అతడు డిగ్రీ చదువుతున్నాడు. స్థానికంగా ప్రవహించే అజ్నార్ నది ప్లాస్టిక్ వ్యర్థాలతో చెత్తకుప్పలా మారడాన్ని చూసి చలించిపోయాడు.
ఎలాగైనా నదిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈత రాకపోవడంతో పాటు చేతులకు గ్లౌజులు, కాళ్లకు బూట్లు వంటి రక్షణ పరికరాలు కూడా లేకపోయినా బిట్టూ తన ప్రయత్నాన్ని ఆపలేదు.
వివరాలు
యథాతథంగా పరిస్థితి
కొందరు స్నేహితుల సహకారంతో సుమారు ఎనిమిది నెలల పాటు నదిలోని వ్యర్థాలను తొలగించాడు.
టన్నుల కొద్దీ చెత్తను బయటకు తీసి నదిని శుభ్రం చేసే కార్యక్రమంతో వార్తల్లో నిలిచాడు. అయితే, అతడి కృషి ఎక్కువ కాలం నిలవలేదు.
నది శుభ్రపడిన కొద్ది వారాలకే ప్రజలు మళ్లీ చెత్తను పడేయడంతో పరిస్థితి యథాతథంగా మారింది.
అయినప్పటికీ నిరుత్సాహపడకుండా మరోసారి శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టేందుకు బిట్టూ సిద్ధమయ్యాడు.
నదులను పరిశుభ్రంగా ఉంచడం ఒక్కరి బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా చెత్తను సరైన ప్రదేశాల్లో వేయాలని ఈ ఘటన గుర్తుచేస్తోంది.