వైద్యశాస్త్రంలో సరికొత్త సర్జరీ: కడుపులో ఉన్న శిశువుకు మెదడు ఆపరేషన్ చేసిన వైద్యులు
వైద్యశాస్త్రం రోజురోజుకు సరికొత్త పుంతలు తొక్కుతోంది. అసాధారణంగా భావించే సమస్యలకు ఆపరేషన్లు చేసి సక్సెస్ సాధిస్తోంది. తాజాగా అమెరికాలోని బోస్టన్ లో బ్రిగమ్ అండ్ విమెన్ హాస్పిటల్స్ వారు, గర్భంలో ఉన్న శిశువుకు బ్రెయిన్ ఆపరేషన్ ను నిర్వహించారు. మెదడు నుండి రక్తాన్ని గుండెకు చేరవేసే రక్తనాళం సరిగ్గా అభివృద్ధి చెందని కారణంగా ఆపరేషన్ చేసి రక్తనాళాన్ని సరి చేసారు. సాధారణంగా ఈ పరిస్థితిని వీనస్ ఆఫ్ గాలెమ్ అంటారని, దీని కారణంగా గుండెమీద ఒత్తిడి ఏర్పడుతుందని, ఈ పరిస్థితి నయం కాకుండా పుట్టిన పిల్లలు, బ్రెయిన్, గుండె సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారని బోస్టన్ హాప్సిటల్ రేడియాలజిస్ట్ డారెన్ ఓర్పాచ్ తెలియజేసారు.
అల్ట్రాసౌండ్ ద్వారా అసాధారణ పరిస్థితిని కనుగొన్న వైద్యులు
అల్ట్రాసౌండ్ ఆధారంగా కడుపులో ఉన్న శిశువు మెదడులో రక్తనాళాలు సరిగ్గా అభివృద్ధి చెందలేదని బోస్టన్ వైద్యులు కనుగొన్నారు. సాధారణంగా ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే మెదడులోని రక్తనాళాల్లోకి కాయిల్స్ ను పంపడానికి క్యాథెటర్ ను ఉపయోగిస్తారట. కానీ దానికి చాలా ఎక్కువ టైమ్ పడుతుందని బోస్టన్ వైద్యులు వెల్లడి చేసారు. గర్భం దాల్చిన 34వారాల్లో ఈ ఆపరేషన్ ను చేసారు వైద్యులు. అల్ట్రాసౌండ్ గైడెన్స్, అమ్నియోసెంటెసిస్ మొదలగు పద్దతులు ఉపయోగించి రక్తనాళాల్లో ఏర్పడిన అసాధారణ పరిస్థితిని సరిచేసారు.