బెలూన్ డైలేషన్: గర్భంలో ఉన్న పిండానికి గుండె ఆపరేషన్ చేసిన వైద్యులు
గర్భంలో ఉన్న పిండానికి ఆపరేషన్ చేయడమనేది చిన్న విషయం కాదు, కానీ దాన్ని చేసి చూపించారు ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వైద్యులు. మార్చ్ 14వ తేదీన ఈ ఆపరేషన్ జరిగింది. కేవలం 90సెకండ్లలో పూర్తయిన ఈ ఆపరేషన్ లో తల్లి, పిండం క్షేమంగా ఉన్నారని సమాచారం. ఇలా గర్భంలో ఉన్న పిండానికి ఆపరేషన్ చేయడాన్ని బెలూన్ డైలేషన్ అంటారు. దీని ప్రకారం, ఒక చిన్న ట్యూబ్ ని బిడ్డ గుండెలోకి పంపిస్తారు. ఆ ట్యూబ్ చివరి భాగంలో బెలూన్ ఉంటుంది. గుండెకు మంచి రక్తాన్ని తీసుకొచ్చే రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి ఈ బెలూన్ ఉపయోగపడుతుంది. ముందుగా తల్లికి మత్తు మందు ఇచ్చి, ఆ తర్వాత ఆపరేషన్ మొదలవుతుంది.
చిన్న సూది సాయంతో బెలూన్ ట్యూబ్ ని గర్భం లోపలికి పంపిన వైద్యులు
ప్రతీ కదలికను అల్ట్రాసౌండ్ సాయంతో గమనిస్తూ ఉన్నామని ఎయిమ్స్ వైద్యులు పీటీఐ తో తెలిపారు. ముందుగా తల్లి కడుపులో నుండి బిడ్డ గుండె వరకు ఒక సూదిని అమర్చారు. ఆ తర్వాత ఆ సూది గుండా బెలూన్ ట్యూబ్ ని పంపి ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులను బెలూన్ ద్వారా తొలగించామని వైద్యులు తెలియజేసారు. ఈ మొత్తం ప్రాసెస్ కి 20-30నిమిషాలు పట్టిందట. ఇలాంటి సర్జరీలు అప్పుడప్పుడు జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. 2022లో ఫ్లోరిడా లోని జాక్వెలిన్ స్కమ్మర్ అనే 28ఏళ్ల మహిళ గర్భ సంచిని బయటకు తీసి, పుట్టబోయే బిడ్డ వెన్నెముక కు సర్జరీ చేసి, గర్భసంచిని కడుపులో పెట్టేసారు. బిడ్డ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు అప్పుడప్పుడు ఇలాంటి సర్జరీలు చేస్తుంటారు.