Laptop: ల్యాప్‌టాప్ వేడితో చర్మంపై వింత మచ్చలు.. ఇదే 'టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్'
ఈ వార్తాకథనం ఏంటి
ల్యాప్‌టాప్‌ను ఒంటిపై పెట్టుకుని గంటల తరబడి ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్ నుంచి వెలువడే వేడి ఎక్కువసేపు చర్మానికి తగలడం వల్ల 'టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్' అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల చర్మంపై కాలిన గాయాల్లా కనిపించే, చేప వల మాదిరిగా ఉండే మచ్చలు ఏర్పడతాయి. ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్స్ ఆఫ్ లీసెస్టర్ NHS ట్రస్ట్ వైద్యులు ఓ బాలుడి కేసును వివరించారు. ఇంటి నుంచే చదువుకుంటున్న ఆ బాలుడు రోజుకు దాదాపు 8 గంటల పాటు ల్యాప్‌టాప్‌ను తన పొట్టపై పెట్టుకుని ఉపయోగించేవాడు. ముఖ్యంగా ల్యాప్‌టాప్ ఛార్జింగ్‌లో ఉన్న సమయంలోనూ దాన్ని తన ఒంటిపై పెట్టుకునేవాడని వైద్యులు తెలిపారు.
వివరాలు
'ఎరిథీమా అబ్ ఇగ్నీ' అంటే ఏమిటి?
వైద్య పరిభాషలో ఈ సమస్యను 'ఎరిథీమా అబ్ ఇగ్నీ' (Erythema ab igne) అంటారు.
సాధారణ కాలిన గాయాల మాదిరిగా ఈ వేడి వెంటనే బొబ్బలు లేదా తీవ్రమైన మంటను కలిగించకపోవచ్చు.
అయితే ఎక్కువసేపు వేడి తగులుతూ ఉంటే చర్మం కింద ఉండే చిన్న రక్తనాళాలు, కణజాలంపై ప్రభావం పడుతుంది.
దీంతో చర్మంపై కాలినట్లు కనిపించే మచ్చలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో చర్మం పొరలు ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది.
గతంలో ఈ సమస్య ఎక్కువగా నిప్పు,ఎలక్ట్రిక్ హీటర్లు లేదా వేడి నీటి సీసాలకు ఎక్కువసేపు దగ్గరగా ఉండే వారికి కనిపించేది.
అయితే ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే వేడి కారణంగానూ ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
వివరాలు
చర్మం పొరలు ఊడటంతో అసలు విషయం వెలుగులోకి
ఈ బాలుడి కేసును 'BMJ Case Reports' అనే వైద్య జర్నల్‌లో వైద్యులు వెల్లడించారు.
బాలుడి పొట్టపై ఏర్పడిన మచ్చలు తొలుత తీవ్రంగా కనిపించడంతో వైద్యులు కాలేయానికి సంబంధించిన సమస్య ఏమైనా ఉందా అని అనుమానించారు.
అయితే రక్త పరీక్షలు, స్కాన్లలో ఎలాంటి సమస్య కనిపించలేదు.
దీంతో బాలుడిని ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు. అయితే రెండు వారాల తర్వాత పరిస్థితి మరింత తీవ్రమవడంతో బాలుడు మళ్లీ ఆసుపత్రికి వచ్చాడు.
అప్పటికి అతని పొట్ట మొత్తం మచ్చలు వ్యాపించాయి. కొన్ని ప్రాంతాల్లో చర్మం పొరలు ఊడిపోవడం కూడా ప్రారంభమైంది. దీంతో వైద్యులు అతని రోజువారీ అలవాట్లు, జీవనశైలి గురించి ఆరా తీశారు.
వివరాలు
ల్యాప్‌టాప్ వేడి కారణంగా చర్మంపై మచ్చలు
ఈ క్రమంలో బాలుడు ప్రతిరోజూ ఎక్కువసేపు ల్యాప్‌టాప్ ఉపయోగిస్తున్నట్లు, దాన్ని నేరుగా పొట్టపై పెట్టుకుని రోజుకు 8 గంటల వరకు వాడుతున్నట్లు గుర్తించారు.
దీంతో ల్యాప్‌టాప్ నుంచి వచ్చిన వేడి కారణంగానే చర్మంపై ఈ మచ్చలు ఏర్పడ్డాయని వైద్యులు నిర్ధారించారు.
అతనికి 'ఎరిథీమా అబ్ ఇగ్నీ' ఉన్నట్లు తేల్చారు. సాధారణంగా ల్యాప్‌టాప్ వేడికి గురికావడం ఆపేస్తే స్వల్ప స్థాయిలో ఉన్న మచ్చలు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
అయితే సమస్య తీవ్రంగా మారితే చర్మంపై మచ్చలు శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం ఉంది.
అంతేకాకుండా, ఒకే ప్రాంతంలో పదేపదే అధిక వేడి తగులుతూ ఉంటే భవిష్యత్తులో చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం స్వల్పంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
ల్యాప్‌టాప్ వేడి కారణంగా చర్మంపై మచ్చలు
అందుకే ల్యాప్‌టాప్‌ను నేరుగా శరీరంపై పెట్టుకుని ఎక్కువసేపు ఉపయోగించకుండా టేబుల్, ల్యాప్‌టాప్ స్టాండ్ వంటి వాటిని ఉపయోగించడం మంచిది.
ముఖ్యంగా ల్యాప్‌టాప్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు వేడి మరింత పెరిగే అవకాశం ఉన్నందున శరీరానికి దూరంగా ఉంచడం ద్వారా ఇలాంటి చర్మ సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చు.