కిచెన్: రాగి ముద్ద నుండి రాగిదోశ వరకు రాగులతో తయారయ్యే వంటకాల రెసిపీస్
రాగులు.. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో రాగులను తైదలు అని పిలుస్తారు. చలికాలంలో రాగులతో చేసిన ఆహారాలు తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. రాగులలో గ్లూటెన్ ఉండదు కాబట్టి బరువు తగ్గడంలో ఇది సాయపడుతుంది. అందుకే రాగులను ఆహారంలో చేర్చుకోవాలి. రాగులతో ఎలాంటి వంటకాలు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. రాగి రొట్టె: రాగిపిండి తీసుకుని అందులో ముక్కలుగా కోసుకున్న ఉల్లిగడ్డలు, తరిగిన క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, నువ్వులు, కారం, ఉప్పు, కావాల్సినన్ని నీళ్ళు పోసి బాగా కలిపి పిండిముద్ద తయారు చేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ గా మార్చి రొట్టెలు కాల్చాలి. ఈ రొట్టెల అంచుకు మీకు నచ్చిన చట్నీ ప్రిపేర్ చేసుకోండి.
రాగులతో తయారయ్యే మరికొన్ని వంటకాలు
రాగిదోశ: రాగిపిండి, బియ్యం పిండి, మినప పిండి, గోధుమ రవ్వను ఒక పాత్రలో తీసుకోవాలి. దీనికి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, జీలకర్ర, కొత్తిమీర, మజ్జిగ కలిపి మిశ్రమం తయారు చేసి పులియబెట్టాలి. ఆ తర్వాత దోశలు వేసుకుని తినండి. రాగిముద్ద: అరకప్పు బియ్యం, కప్పు రాగులు తీసుకోవాలి. ఒక పాత్రలో నాలుగు కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. ఆ టైమ్ లో అందులో బియ్యం వేసి బాగా ఉడకబెట్టాలి. ఆ తర్వాత రాగిపిండిని అందులో వేయాలి. నీరు పూర్తిగా ఇంకిపోయాక ముద్దలుగా చేసి మీకు నచ్చిన కూరతో తినేయండి. సాధారణంగా మటన్ సూప్, చికెన్ సూప్ ఇందులోకి బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు పప్పుచారు, టమాటో పచ్చడి తయారు చేసుకోవచ్చు.