Health Benefits Of Chia Seeds: చియా సీడ్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
మనం తరచూ వినే కొన్ని ఆహార పదార్థాల ప్రాముఖ్యతను ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోం. కానీ చియా గింజల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే, ఈ గింజల ద్వారా ఎన్నో రోగాలను నివారించవచ్చు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నేటి బిజీ జీవితంలో అందరూ త్వరగా శక్తినిచ్చే ఆహార పదార్థాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అటువంటి ఆహారంలో చియా గింజలు ఒక ముఖ్యమైన వాటిగా నిలిచాయి. వీటిని చూడటానికి చిన్నగా ఉన్నా, శాస్త్రవేత్తలు వాటిని అద్భుతమైన పోషక ఆహారంగా గుర్తించారు. చియా గింజలు కేవలం బరువును తగ్గించడమే కాకుండా డయాబెటిస్‌ను నియంత్రిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి, ఎముకల పటుత్వాన్ని పెంచుతాయి. శరీరానికి, మెదడుకు చురుకుదనాన్ని ఇచ్చే శక్తివంతమైన ఆహారంగా వీటిని అభివర్ణిస్తున్నారు.
పుదీనా మొక్క జాతి
చియా గింజలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్లో ఒకటిగా నిలిచాయి. ఈ గింజలు పుదీనా జాతికి చెందిన 'సాల్వియా హిస్పానికా' అనే మొక్కల నుంచి సేకరించబడతాయి, ఇవి ప్రధానంగా దక్షిణ అమెరికా ప్రాంతాల్లో పెరుగుతాయి. వీటి పరిమాణం చిన్నదిగా ఉన్నప్పటికీ, పోషకత విషయంలో ఈ గింజలు ఎంతో కీలకమైనవి. చియా గింజలలో 15.25% ప్రోటీన్, 26.41% కార్బోహైడ్రేట్లు, 30.33% కొవ్వులు, 18.30% పీచు, పుష్కలంగా ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఎక్కువ ఖనిజాలు
చియా గింజలు అధిక ఖనిజాలను అందిస్తాయి, ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం. అలాగే, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజల సేవనంతో రక్తంలో ఏఎల్ఎ (ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్) మరియు ఈపీఏ (ఎకోసాపెంటానోక్ యాసిడ్) స్థాయిలు పెరుగుతాయని పరిశోధనల ద్వారా నిర్ధారించబడింది.
అధిక మొత్తంలో పీచు పదార్థాలు
చియా గింజల్లో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. వంద గ్రాముల చియా గింజలలో సుమారు 34 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది, ఇది గింజ బరువుకు 12 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుంటుంది. దీని వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి, గ్లూకోజ్ విడుదల కూడా నియంత్రితంగా జరుగుతుంది. అందువల్ల, డయాబెటిస్ ఉన్నవారికి చియా గింజలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి ప్లాస్మా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఈ ప్రయోజనాల కారణంగా, చియా గింజలను ప్రతిరోజు తగిన మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదిగా పేర్కొనవచ్చు. మీ డైట్‌లో ఈ పోషక పదార్థాలను చేర్చడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.