Children's Day: భారత రాజ్యాంగం కల్పించిన బాలల హక్కులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
బాలల దినోత్సవం అంటే కేవలం ఆటలు, ఉత్సవాలు కాదు. దేశంలోని ప్రతి బిడ్డకు ఉన్న ముఖ్యమైన హక్కులు, రక్షణ గురించి అవగాహన కలిగించే రోజు కూడా. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుతారు. నెహ్రూ కోరికను నెరవేర్చే విధంగా పిల్లలకు సరైన విద్య, ఆరోగ్యం, సంక్షేమం అందించడానికి ప్రతి పెద్ద, ప్రభుత్వం, సమాజం బాధ్యత వహించాలి. రాజ్యాంగం కూడా పిల్లల కోసం కొన్ని ప్రత్యేకమైన హక్కులను కల్పించి, వాటిని రక్షించే బాధ్యత మనందరిపై ఉంది.
భారత రాజ్యాంగంలోని బాలల హక్కులు
1.సమానత్వపు హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రతి బిడ్డ సమానమే. బిడ్డల మధ్య పేద, ధనిక భేదం చూపకుండా వారందరికీ సమాన హక్కులు కల్పించాలి. 2. జీవించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం, దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు భద్రతతో జీవించే హక్కు ఉంది. వారి స్వేచ్ఛను, రక్షణను అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, సమాజానిదే. 3. వివక్ష రహిత హక్కు ఆర్టికల్ 15 ప్రకారం పిల్లలకు జాతి, మతం, కులం, లింగం ఆధారంగా వివక్ష చేయకూడదు. వారందరినీ సమానంగా చూడాలి.
4. ఉచిత నిర్బంధ విద్యా హక్కు
ఆర్టికల్ 21ఏ ప్రకారం, 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించాల్సిన బాధ్యత సమాజానిదే. 5. దోపిడీ నుంచి రక్షణ ఆర్టికల్ 23 ప్రకారం, పిల్లలను అక్రమ రవాణా, వెట్టి చాకిరీ నుండి రక్షించాలి. 6. ప్రమాదకర ఉద్యోగాలకు నిషేధం ఆర్టికల్ 24 ప్రకారం, పద్నాలుగేళ్లలోపు పిల్లలను ప్రమాదకర ఉద్యోగాలలో నియమించకూడదు.
7. భాగస్వామ్య హక్కు
పిల్లలకు తమ అభిప్రాయాలు చెప్పుకునే హక్కు ఉంటుంది. వారు ఏవైనా అభిప్రాయాలు వ్యక్తం చేయగలగాలి. 8. గుర్తింపు హక్కు పిల్లలకు ఒక పేరు, జాతీయత ఉండే హక్కు ఉంటుంది. వారికి తల్లిదండ్రుల గుర్తింపు, కుటుంబ సంబంధాల రక్షణ ఉంటుంది. 9. పర్యావరణ హక్కు పిల్లలకు శుభ్రమైన, సురక్షితమైన పర్యావరణంలో జీవించే హక్కు కల్పించాలి. 10. అభివృద్ధి హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 39ఎఫ్ ప్రకారం పిల్లలకు ఆరోగ్యం, పోషకాహారం, సంపూర్ణ అభివృద్ధికి అవసరమైన అన్ని అవకాశాలు కల్పించాలి.