Ragi Chocolate Cake : ఓవెన్ అవసరం లేదు..ఇంట్లోనే హెల్దీ రాగి చాక్లెట్ కేక్
ఈ వార్తాకథనం ఏంటి
క్రిస్మస్,న్యూ ఇయర్ పండుగలు దగ్గరపడుతున్న వేళ చాలా మంది ఈ వేడుకలను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తుంటారు. సాధారణంగా కేక్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బేకరీనే.కానీ,బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే ఓ ప్రత్యేకమైన కేక్ రెసిపీ ఉందన్న విషయం మీకు తెలుసా? అదే రాగిపిండితో చేసే రుచికరమైన,ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్.ఎలాంటి రసాయన పదార్థాలు ఉపయోగించకుండా తయారయ్యే ఈ కేక్ మంచి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతేకాదు,దీన్ని తయారుచేయడానికి ఓవెన్ అవసరం కూడా లేదు.సాధారణ కుక్కర్‌లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు?ఈ సూపర్ టేస్టీ రాగిచాక్లెట్ కేక్ ఎలా తయారుచేయాలి?అందుకు కావాల్సిన పదార్థాలేమిటి? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
కావలసిన పదార్థాలు:
రాగి పిండి - అర కప్పు గోధుమ పిండి - అర కప్పు పెరుగు - ఒక కప్పు బెల్లం పొడి - ముప్పావు కప్పు వేడి పాలు - పావు కప్పు కోకో పౌడర్ - పావు కప్పు బటర్ - అర కప్పు కాఫీ పౌడర్ - ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా - అర టీస్పూన్ డార్క్ చాక్లెట్ - ఒకటిన్నర కప్పులు బేకింగ్ పౌడర్ - ఒక టీస్పూన్ సన్నగా తరిగిన బాదం పలుకులు - ముప్పావు కప్పు
వివరాలు
తయారీ విధానం:
ముందుగా రాగిపిండి, గోధుమ పిండిని వేర్వేరుగా జల్లించి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి. అదే సమయంలో బటర్‌ను కరిగించి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో పాత్రలో పాలు పోసి మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత మంట ఆపి అందులో కాఫీ పౌడర్ వేసి పూర్తిగా కలిసేలా కలిపి పక్కన పెట్టాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, బేకింగ్ సోడా వేసి బాగా గిలక్కొట్టాలి. బుడగలు రావడం మొదలైతే అందులో బెల్లం పొడి, కాఫీ కలిపిన పాలు, కరిగించిన బటర్ వేసి మళ్లీ కొద్దిసేపు బాగా కలపాలి.
వివరాలు
తయారీ విధానం:
ఈ మిశ్రమంలో ముందుగా జల్లించి పెట్టుకున్న రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్ వేసి ఎక్కడా ముద్దలు లేకుండా మెల్లగా కలుపుకోవాలి. తర్వాత కేక్ టిన్ లేదా అల్యూమినియం పాత్ర తీసుకుని లోపల అంతా బటర్ లేదా నెయ్యి రాసి, కొద్దిగా పొడి గోధుమ పిండిని చల్లి అన్ని వైపులా అంటుకునేలా చేయాలి. ఇప్పుడు అందులో సిద్ధం చేసిన కేక్ మిశ్రమాన్ని పోసి పైభాగం సరిగా ఉండేలా పరచాలి. ఇక స్టవ్ మీద కుక్కర్ ఉంచి అడుగుభాగంలో కొద్దిగా దొడ్డు ఉప్పు మందంగా వేసుకోవాలి. మూత పెట్టి విజిల్ లేకుండా ఐదు నుంచి ఆరు నిమిషాలు వేడి చేయాలి. అంటే కుక్కర్‌ను ప్రీహీట్ చేసినట్టే.
వివరాలు
తయారీ విధానం:
ఆ తర్వాత మూత తీసి కేక్ మిశ్రమం ఉన్న పాత్రను కుక్కర్‌లో ఉంచి, మళ్లీ మూత పెట్టి లో ఫ్లేమ్‌పై సుమారు 40 నుంచి 45 నిమిషాల పాటు ఉడికించాలి. కేక్ పూర్తిగా సిద్ధమైందో లేదో తెలుసుకోవడానికి టూత్‌పిక్‌ను కేక్‌లో గుచ్చి చూడాలి. అది శుభ్రంగా బయటకు వస్తే కేక్ బాగా ఉడికినట్టే. అప్పుడు మంట ఆపి కేక్‌ను పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక మరో పాత్రలో డార్క్ చాక్లెట్ వేసి సన్నని మంట మీద కలుపుతూ కరిగించి క్రీమ్‌లా తయారుచేసుకోవాలి.
వివరాలు
తయారీ విధానం:
ముందుగా తయారుచేసుకున్న కేక్‌ను ఒక వెడల్పాటి ప్లేట్‌లోకి తీసుకుని పైభాగాన్ని కొద్దిగా సమానంగా కట్ చేయాలి. ఆపై కరిగించిన చాక్లెట్ క్రీమ్‌ను కేక్ మీద అంతా సమానంగా స్ప్రెడ్ చేయాలి. చివరగా సన్నగా తరిగిన బాదం పలుకులతో అలంకరించాలి. ఇంతే... ఎలాంటి కష్టమూ లేకుండా ఇంట్లోనే నోరూరించే రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి చాక్లెట్ కేక్ రెడీ!