కండ్ల కలక ఎలా వస్తుంది? లక్షణాలు ఏంటి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రస్తుతం కండ్ల కలక ఎక్కువ మందిలో కనిపిస్తోంది. వర్షాలు పడుతున్న సమయంలో కండ్ల కలక సోకడం సాధారణ విషయమే. కండ్ల కలక గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. కండ్ల కలక ఎలా వస్తుంది? వైరస్, బ్యాక్టీరియా, అలర్జీ కారణంగా కండ్ల కలక వస్తుంది. సాధారణంగా వారం, లేదా రెండు వారాల్లో ఈ ఇబ్బంది తగ్గుతుంది. బ్యాక్టీరియా కారణంగా కండ్ల కలక వస్తే కొన్నిసార్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు చూపు మసకబారిపోయే అవకాశం ఉంది. కండ్ల కలక లక్షణాలు: కళ్ళు ఎర్రగా మారడం, దురద, కనురెప్పలు ఉబ్బడం, కళ్ళలో మంట, ఊసుల కారణంగా కనురెప్పలు అతుక్కోవడం, వెలుతురును చూడలేకపోవడం, కంటి నుండి స్రావాలు కారడం వంటి లక్షణాలు ఉంటాయి.
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే కండ్ల కలక వస్తుందా?
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే కండ్ల కలక రావడమనేది అపోహ. వ్యాధి సోకిన వ్యక్తి కంటి స్రావాలను చేతితో తాకడం, పదే పదే కళ్ళలో చేతులు పెట్టుకోవడం, కాంటాక్ట్ లెన్స్ వాడేవారు వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం మొదలగు కారణాల వల్ల కండ్ల కలక వ్యాప్తి చెందుతుంది. రాకుండా నిరోధించాలంటే? వ్యక్తిగత శుభ్రత పాటించాలి. తుమ్మినపుడు, దగ్గినపుడు నోటికి అడ్డుగా టిష్యూ పేపర్ పెట్టుకోవాలి. దీనివల్ల ఇతరులకు సోకదు. పదే పదే కళ్ళను ముట్టుకోకూడదు, భౌతిక దూరం పాటించడం మంచిది. అలాగే కండ్ల కలక లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.