LOADING...
Crunchy Carrot Fries: ఆరోగ్యమూ రుచీ కలిసిన కరకరలాడే క్యారెట్ ఫ్రైస్.. పిల్లలకు పర్ఫెక్ట్ స్నాక్
పిల్లలకు పర్ఫెక్ట్ స్నాక్

Crunchy Carrot Fries: ఆరోగ్యమూ రుచీ కలిసిన కరకరలాడే క్యారెట్ ఫ్రైస్.. పిల్లలకు పర్ఫెక్ట్ స్నాక్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 25, 2025
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల జాబితాలో క్యారెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా చాలామంది క్యారెట్‌ను నేరుగా తినడం లేదా కర్రీ, హల్వా లాంటి వంటకాలుగా తయారు చేస్తుంటారు. కానీ ఇవే కాకుండా క్యారెట్‌తో కరకరలాడే ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు.ఇవి తినడానికి ఎంతో రుచిగా ఉండడమే కాకుండా ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఏమాత్రం తీసిపోవు. తయారీ కూడా చాలా ఈజీ. పిల్లలకు స్నాక్‌గా ఇవి బెస్ట్ ఆప్షన్. అంతేకాదు, ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డిస్తే ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటారు. ఇక ఆలస్యం ఎందుకు? క్యారెట్‌తో క్రిస్పీ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వివరాలు 

కావాల్సిన పదార్థాలు: 

క్యారెట్ - 200 గ్రాములు మైదా పిండి - పావు కప్పు అల్లం-వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్ కారం - అర టీస్పూన్ జీలకర్ర పొడి - పావు టీస్పూన్ ధనియాల పొడి - పావు టీస్పూన్ ఉప్పు - తగినంత బ్రెడ్ క్రంబ్స్ - అవసరమైనంత

వివరాలు 

తయారీ విధానం: 

ముందుగా క్యారెట్‌ల పొట్టు తొలగించి శుభ్రంగా కడగాలి. చివర్లను తీసేసి క్యారెట్ సైజ్‌ను బట్టి రెండు లేదా మూడు సమాన ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత ఫ్రైస్ మాదిరిగా పొడవుగా, సన్నగా ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై గిన్నె పెట్టి ఒక లీటర్ నీళ్లు పోసి మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత అందులో క్యారెట్ ముక్కలు వేసి మీడియం మంటపై కొద్దిసేపు ఉడికించాలి. క్యారెట్‌లు సగం మేర ఉడికిన వెంటనే బయటకు తీసి ఒక ప్లేట్‌లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు కోటింగ్‌కు కావాల్సిన మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్‌లో మైదా పిండి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.

Advertisement

వివరాలు 

తయారీ విధానం: 

ఆ తర్వాత అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా పేస్ట్‌లా తయారు చేసి పక్కన ఉంచాలి. మరో ప్లేట్‌లో బ్రెడ్ క్రంబ్స్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. ఆయిల్ కాగుతున్నంతలో ఉడికించిన క్యారెట్ ముక్కలను మైదా పిండి మిశ్రమంలో వేసి అన్ని వైపులా సమంగా కోట్ అయ్యేలా కలపాలి. తర్వాత ఆ ముక్కలను బ్రెడ్ క్రంబ్స్‌లో వేసి పూర్తిగా కప్పేలా కలపాలి. నూనె బాగా వేడయ్యాక ఈ క్యారెట్ ముక్కలను జాగ్రత్తగా కడాయిలో వేసుకోవాలి. మొదట రెండు నిమిషాలు కదపకుండా ఉంచి, తర్వాత గరిటెతో నెమ్మదిగా కలుపుతూ మీడియం మంటపై వేయించాలి.

Advertisement

వివరాలు 

తయారీ విధానం: 

క్యారెట్ ముక్కలు క్రిస్పీగా మారి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చిన తర్వాత బయటకు తీసి ప్లేట్‌లో వేసుకోవాలి. మిగిలిన ముక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అన్నీసిద్ధమైన తర్వాత వేడివేడిగా టమాటా కెచప్‌తో వడ్డిస్తే ఎంతో రుచిగా,క్రంచీగా ఉండే క్యారెట్ ఫ్రైస్ రెడీ. నచ్చితే మీరూ తప్పకుండా ట్రై చేయండి. చిట్కాలు: లేత క్యారెట్‌లు వాడితే త్వరగా ఉడుకుతాయి,అలాగే బాగా వేగుతాయి. క్యారెట్‌లను ఎక్కువగా మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు.మరీ మెత్తగా అయితే పేస్ట్‌లా మారి నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి. కాబట్టి సగం మేర ఉడికిస్తే సరిపోతుంది. మైదాపిండి బదులు కార్న్‌ఫ్లోర్‌ను కూడా ఉపయోగించవచ్చు.అలాగే బ్రెడ్ క్రంబ్స్ లేకపోతే బ్రెడ్ స్లైస్‌లను మిక్సీజార్‌లో వేసి బరకగా గ్రైండ్ చేసి వాడుకోవచ్చు.

Advertisement