దసరా నవరాత్రి 2023: ఐదవరోజు శ్రీ మహాచండీ అలంకరణలో అమ్మవారి దర్శనం
నవరాత్రి ఉత్సవాల్లో ఐదవరోజున అమ్మవారిని శ్రీ మహా చండీ అలంకరణలో పూజిస్తారు. ఈరోజున అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అలాగే పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజున అమ్మవారు శ్రీ మహా చండీ అలంకరణలో దర్శనమిస్తారు. ఈరోజున కదంబం, పులిహోర, చక్కెర పొంగళి, కట్టె పొంగలి, రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించాలి. నవరాత్రి ఉత్సవాల్లో ఉపవాసం ఉండే భక్తులు, లలిత సహస్ర నామ స్తోత్రం, చండీ సప్తశతి, శ్రీ దేవి ఖడ్గమాల వంటి శ్లోకాలను పారాయణం చేయాలని, దానివల్ల మంచి జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.
మనసులోని కోరికలను నెరవేర్చే శ్రీ మహా చండీ దేవి
శ్రీ మహా చండీ దేవి పూజిస్తే సకల దేవతలను పూజించినట్టేనని, మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతీ స్వరూపిణిగా శ్రీ మహా చండీ అమ్మవారు ఉద్భవించారని అంటారు. మహా చండీ అమ్మవారిని పూజించడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. అంతేకాదు, మానసిక ఇబ్బందులతో బాధపడేవారికి మహా చండీని పూజించడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు. గ్రహపీడలు తొలగిపోవాలంటే నవరాత్రి ఉత్సవాల్లో ఐదవ రోజున శ్రీ మహా చండీ అలంకరణలో దర్శనమిచ్చే అమ్మవారిని కొలవాలని, పూజించాలని పండితులు చెబుతున్నారు. ఈ విశేషమైన రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించాలని తెలియజేస్తున్నారు.