నవరాత్రి, దుర్గాపూజ మధ్య తేడాలున్నాయా? అవేంటో తెలుసుకోండి
దసరా సమయంలో నవరాత్రి, దుర్గాపూజ సంబరాలు చాలా ఉత్సాహంగా జరుగుతాయి. అయితే ఈ రెండు పండగలు ఒకే విధంగా ఉన్నప్పటికీ సాంప్రదాయపరంగా ఈ రెండు పండుగల్లో కొన్ని తేడాలు కనిపిస్తాయి. ఈ రెండు పండగల్లో కూడా దుర్గామాతను పూజిస్తారు. కానీ ఆ పూజించే పద్ధతులు భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ రెండు పండగల మధ్య తేడాలు తెలుసుకుందాం. దుర్గామాత అమ్మవారిని తొమ్మిది రోజులపాటు 9రూపాల్లో కొలుస్తారు. పశ్చిమబెంగాల్, తూర్పు భారతదేశ రాష్ట్రాల్లో దుర్గాపూజ ప్రధాన పండగగా ఉంటుంది. అలాగే ఉత్తర భారత దేశం, పశ్చిమ భారతదేశంలో నవరాత్రి ఉత్సవాలు ప్రధానంగా ఉంటాయి. ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15న మొదలయ్యాయి. అక్టోబర్ 24వ తేదీన పూర్తవుతాయి.
నవరాత్రి, దుర్గాపూజ మధ్య తేడాలు
నవరాత్రి ఉత్సవాల్లో మొదటిరోజున బాలా త్రిపుర సుందరీ అలంకరణలో అమ్మవారు దర్శన్మిస్తారు. ఆ తర్వాత తొమ్మిది రోజులపాటు 9రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. మరోవైపు దుర్గామాత, రాక్షసుడు మహిషాసురుడి మధ్య పోరాటం ప్రారంభమయ్యే రోజు నుండి దుర్గాపూజ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండేవారు మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి తినకుండా ఉంటారు. దీనికి విరుద్ధంగా తూర్పు భారతదేశ రాష్ట్రాల్లోని ప్రజలు తమ ఆహారంలో మాంసాన్ని భాగం చేసుకుంటారు. నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన దసరా రోజున రావణాసురుడి బొమ్మను కాలుస్తారు. ఇటువైపు దుర్గాపూజ పండుగలో శోభాయాత్ర నిర్వహించి దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. శోభాయాత్రలో రకరకాల నృత్యాలు చేస్తారు.