Dasara Navaratri 2023: మూడవరోజు అన్నపూర్ణా దేవి అలంకారం విశేషాలు తెలుసుకోండి
దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాల్లో పూజిస్తారు. ఇందులో భాగంగా మూడవరోజు నాడు అన్నపూర్ణా దేవి అలంకారంలో కొలుస్తారు. ఈ విశ్వంలో ప్రతీ జీవికి అన్నమే ఆధారం. ప్రాణికోటి చలనంతో ఉండాలంటే అన్నమే ముఖ్యం. అన్నపూర్ణా దేవిని పూజిస్తే అన్నానికి ఎలాంటి లోటు ఉండకుండా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. కాశీ విశ్వేశ్వరుడి సతీమణి పార్వతీదేవిని అన్నపూర్ణా దేవిగా పిలుస్తారు. ఈరోజున అమ్మవారు గంధం రంగు చీరలో భక్తులకు దర్శనమిస్తారు. తెలుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అన్నపూర్ణాదేవి అలంకారం గురించి ఒకానొక కథ బాగా ప్రాచుర్యంలో ఉంది. ప్రస్తుతం ఆ కథ ఏంటో తెలుసుకుందాం.
శివుడికే అన్నం పెట్టిన పార్వతీదేవి
కాశీ విశ్వేశ్వరుడైన శివుడు, ఒకసారి పార్వతీదేవితో ఇలా అన్నాడు. ఈ ప్రపంచమంతా మాయ, అందులో అన్నం కూడా మాయేనని అన్నాడట. శివుడి మాటలు పార్వతీదేవికి నచ్చలేదట. దాంతో కాశీని విడిచి పార్వతీదేవి వెళ్ళిపోయింది. పార్వతీ దేవి వెళ్ళగానే కాశీ ప్రాంతంలో విపరీతమైన కరువు ఏర్పడిందట. తినడానికి తిండి లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారట. ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి శివుడు ఏమీ చేయలేకపోయాడట. ఆ సమయంలో పార్వతీదేవి కాశీకి తిరిగి వచ్చిందట. అప్పుడు ప్రజలకు పుష్కలంగా అన్నం దొరికిందని చెబుతారు. ఇదంతా చూసిన శివుడు, అన్నం మాయే అన్న మాటలు తప్పని తెలుసుకుని,అన్నం పెట్టమని భిక్షపాత్రను పార్వతీదేవి ముందు ఉంచాడట. అలా శివుడికే అన్నం పెట్టి అన్నపూర్ణగా పార్వతీదేవి మారింది.