దసరా నవరాత్రి 2023: దాండియా, గార్భా మధ్య తేడాలు మీకు తెలుసా?
దసరా నవరాత్రి ఉత్సవాల్లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన దాండియా, గార్భా డాన్సులను ఆడతారు. చెడు మీద మంచి గెలిచిన సందర్భంగా సంబరాలు జరుపుకునేందుకు దాండియా, గార్భా నృత్యాలను చేస్తారు. ఈ రెండు నృత్యాలు ఒకేలా ఉన్నప్పటికీ వీటికి చాలా తేడాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు నృత్యాల మధ్య తేడాలు తెలుసుకుందాం. మహిషాసురుడిని వధించిన దుర్గామాత విజయాన్ని సూచించే నృత్యాలు: దాండియా, గార్భా నృత్యాలు రాక్షసుడు మహిషాసురుడిని వధించిన దుర్గామాత విజయాన్ని సూచిస్తాయి. దాండియాలో వాడే చేతి కర్రలు(కోలలు) దుర్గామాత ఖడ్గాన్ని సూచిస్తాయి. చిన్న మంట చుట్టూ లేదంటే దుర్గామాత విగ్రహం చుట్టూ గర్భా నృత్యాలు చేయడమనేది గర్భంలోని జీవితాన్ని సూచిస్తుంది.
జీవన చక్రాన్ని సూచించే గార్భా నృత్యం
గార్భా నృత్యాలు చేస్తున్నప్పుడు గుండ్రంగా తిరుగుతారు. అది జీవన చక్రాన్ని సూచిస్తుంది. గార్భా నృత్యాన్ని సాధారణంగా హారతికి ముందు చేస్తారు. ఈ నృత్యం చేసేటప్పుడు చేతులను, కాళ్లను సంగీత శబ్దాలకు అనుకూలంగా కదిలిస్తారు. ఈ నృత్యం చేయడానికి ఒక సమూహం అవసరం అవుతుంది. దాండియా నృత్యాలను సాధారణంగా హారతి తర్వాత చేస్తారు. దాండియా నృత్యం ఆడడానికి ఎక్కువమంది అవసరం ఉంటుంది. సాధారణంగా దాండియా నృత్యంలోని పాటలు రాధా, గోపికలతో శ్రీకృష్ణ లీలల గురించి ఉంటుంది. గార్భా నృత్యం స్త్రీత్వాన్ని, సంతానోత్పత్తిని ఇంకా 9అవతారాల్లో దేవతా మూర్తిని సూచిస్తుంది. గార్భా ఆడేటప్పుడు గుండ్రంగా ఆడతారు. దాండియాలో మాత్రం గుండ్రంగా కాకుండా మామూలుగా ఆడతారు.