LOADING...
Peanut Laddu with Atukulu: పల్లీలు,అటుకులతో పసందైన లడ్డూలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
పల్లీలు,అటుకులతో పసందైన లడ్డూలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!

Peanut Laddu with Atukulu: పల్లీలు,అటుకులతో పసందైన లడ్డూలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

పిల్లలు ఎదుగుతున్న దశలో వారికి సరైన పోషకాహారం అందించడం అత్యంత కీలకం. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే పిల్లలే కాదు పెద్దలూ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి బలం ఇచ్చే ఆహారం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మీ కోసం ఓ అద్భుతమైన, ఆరోగ్యకరమైన రెసిపీని తీసుకొచ్చాం. అదే... అటుకులు, పల్లీలతో తయారయ్యే రుచికరమైన పల్లీ అటుకుల లడ్డూలు. సాధారణంగా లడ్డూలు అనగానే రవ్వ లడ్డు, నువ్వుల లడ్డు వంటి వాటినే ఎక్కువగా తయారు చేస్తుంటారు.

వివరాలు 

పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇవి నచ్చుతాయి

అయితే ప్రతిసారి అవే కాకుండా ఈసారి కాస్త కొత్తగా పల్లీ అటుకుల లడ్డూలను ట్రై చేసి చూడండి. ఒక్క చుక్క నెయ్యి గానీ, నూనె గానీ ఉపయోగించకుండా తయారయ్యే ఈ లడ్డూలు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇవి నచ్చుతాయి. పోషక విలువలు పుష్కలంగా ఉండటంతో పాటు, తయారీకి ఎక్కువ సమయం పట్టదు. పైగా పాకం పట్టే తంటా కూడా లేదు. వంటలో కొత్తవాళ్లు అయినా సులభంగా, తక్కువ శ్రమతో ఈ లడ్డూలను సిద్ధం చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డూలు ఎలా తయారు చేయాలి? ముందుగా కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం.

వివరాలు 

కావాల్సిన పదార్థాలు : 

ఒక కప్పు - పల్లీలు అర కప్పు - అటుకులు అర కప్పు - నువ్వులు ఒక కప్పు - సన్నగా తురిమిన బెల్లం ఒక టీస్పూన్ - యాలకుల పొడి

Advertisement

వివరాలు 

తయారీ విధానం : 

ఈ ఆరోగ్యకరమైన లడ్డూల తయారీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి, అందులో పల్లీలను వేసి మితమైన మంటపై బాగా వేయించాలి. పల్లీలు చక్కగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో మందపాటి అటుకులను వేసి, లో ఫ్లేమ్‌పైనే కాస్త క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఆపై అదే కడాయిలో నువ్వులు వేసుకుని, వాటిపై ఒక టేబుల్ స్పూన్ నీళ్లు చల్లి గరిటెతో నిరంతరం కలుపుతూ మితమైన మంటపై వేయించాలి. ఇలా నీళ్లు చల్లుతూ వేయించడంతో నువ్వులు కాలిపోకుండా గుల్లగా, బాగా వేగుతాయి. నువ్వులు సిద్ధమైన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

Advertisement

వివరాలు 

తయారీ విధానం : 

ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టాలి. అలాగే లడ్డూల రుచి, నాణ్యత మీరు పదార్థాలను ఎంత జాగ్రత్తగా వేయించారన్నదానిపై ఆధారపడి ఉంటుంది. తర్వాత మిక్సీ జార్‌లో ముందుగా వేయించి చల్లార్చుకున్న అటుకులను వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. మరో మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి పొట్టు తీసిన పల్లీలను వేసి కాస్త బరకగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అందులోనే వేయించిన నువ్వులను వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఇక ఆ మిశ్రమంలో సన్నగా తురిమిన బెల్లాన్ని వేసి, గరిటెతో ఓసారి కలిపి, మరోసారి మెత్తగా గ్రైండ్ చేయాలి.

వివరాలు 

తయారీ విధానం : 

ఇలా సిద్ధమైన పల్లీ-నువ్వులు-బెల్లం మిశ్రమాన్ని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని వేసి, రెండు మిశ్రమాలు సమంగా కలిసేలా బాగా కలపాలి. చివరగా యాలకుల పొడిని కూడా జోడించి, చేతితో గట్టిగా పిండుతూ మిశ్రమాన్ని బాగా కలపాలి. మిశ్రమం పూర్తిగా సిద్ధమైన తర్వాత, కొద్దికొద్దిగా తీసుకుంటూ చేతితో గట్టిగా ఒత్తుతూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవాలి. ఒకవేళ లడ్డూలు చుట్టడానికి ఇబ్బంది అనిపిస్తే, చేతులను కాస్త తడిచేసుకుని చుట్టుకుంటే చక్కగా వస్తాయి. ఇలా మొత్తం మిశ్రమాన్ని లడ్డూలుగా తయారు చేసుకోవాలి.

వివరాలు 

తయారీ విధానం : 

అంతే... తక్కువ పదార్థాలతో, ఎలాంటి నూనె లేకుండా తయారయ్యే హెల్దీ అండ్ టేస్టీ పల్లీ అటుకుల లడ్డూలు సిద్ధం! వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే సుమారు 10 నుంచి 15 రోజుల వరకు తాజాగా ఉంటాయి. మరి ఆలస్యం ఎందుకు? మీరూ ఒకసారి ఈ పల్లీ లడ్డూలను ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

Advertisement