డయాబెటిస్ కారణంగా కిడ్నీలు ప్రభావితం అయ్యాయని తెలియజేసే సంకేతాలు
డయాబెటిస్ ఉన్నవారు తమ కిడ్నీలకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, డయాబెటిస్ కు వాడే మందుల వల్ల కిడ్నీల మీద ప్రభావం పడటం.. మొదలగు కారణాల వల్ల మూత్రపిండాలు తమ పనిని సక్రమంగా చేయలేవు. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే వాటిని తీసేయాల్సి రావచ్చు. అందుకే డయాబెటిస్ అనేది కిడ్నీల మీద ప్రభావం చూపుతుందని ముందే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ పరిస్థితి గుర్తించాలంటే కొన్ని లక్షణాలను గుర్తుపట్టాలి. అవేంటో చూద్దాం. అలసట: ఊరికే అలసిపోవడం, పని చేయకపోయినా అలసటగా అనిపించడం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే జాగ్రత్తపడటం మంచిది. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
మూత్రపిండాల మీద డయాబెటిస్ ప్రభావం చూపితే శరీరంలో కనిపించే లక్షణాలు
చర్మం పొడిబారడం, దురద కలగడం: మూత్రపిండాల మీద ప్రభావం చూపడం వలన వ్యర్థ పదార్థాలు శరీరంలోకి బయటకి పోవు. ఈ కారణంగా చర్మం పొడిబారడం సంభవిస్తుంటుంది. విపరీతమైన దురద ఉంటుంది. ఆకలి మార్పులు: విపరీతంగా ఆకలి వేయడం లేదా అసలు ఆకలి వేయకపోవడం అనేది సడెన్ గా జరిగిందంటే జాగ్రత్త పడాల్సిందే. ముంపు ముంచుకు రాకముందే అప్రమత్తం అవ్వాలి. పాదాలు, చేతులు, మడమలు ఉబ్బడం: పాదాలు, చేతులు, మడమలు ఉబ్బుతున్నట్లుగా కనిపిస్తే డాక్టరును సంప్రదించడం మంచిది. శరీరంలోని వ్యర్థాలు బయటకి పోవు కాబట్టి ఇలా శరీరం ఉబ్బిపోయి బరువు పెరుగుతారు. మూత్రంలో ప్రోటీన్ ఆనవాళ్ళు కనిపిస్తే కూడా డయాబెటిస్ అనేది కిడ్నీల మీద ప్రభావం చూపుతుందని అర్థం చేసుకోవాలి.