LOADING...
Health Benefits of Beetroot: రోజూ బీట్‌రూట్‌ తింటే రక్తహీనత తగ్గుతుందా? నిపుణుల పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి!
రోజూ బీట్‌రూట్‌ తింటే రక్తహీనత తగ్గుతుందా? నిపుణుల పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి!

Health Benefits of Beetroot: రోజూ బీట్‌రూట్‌ తింటే రక్తహీనత తగ్గుతుందా? నిపుణుల పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2025
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

రక్తహీనత సమస్య అనగానే చాలామంది ముందుగా గుర్తు చేసుకునే ఆహార పదార్థం బీట్‌రూట్‌. ఐరన్‌ అధికంగా ఉండే ఈ దుంప, తక్కువ సమయంలోనే హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడంలో సహాయపడటమే కాకుండా శరీరానికి అవసరమైన ఎన్నో కీలక పోషకాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కెంపు రంగులో మెరిసే బీట్‌రూట్‌ అందం, ఆరోగ్యం రెండింటికీ చిరునామాగా మారింది. క్రమం తప్పకుండా బీట్‌రూట్‌ తీసుకుంటే నిజంగా రక్తహీనత తగ్గుతుందా? దీనివల్ల ఇంకేం లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అందానికీ, ఆరోగ్యానికీ రాజుగా చెప్పుకునే దుంపల్లో బీట్‌రూట్‌ ముందు వరుసలో ఉంటుంది. దీన్ని పచ్చిగా తినడమే కాకుండా కూరలు, జ్యూస్‌లు, సూపులు, స్మూతీల రూపంలో కూడా చాలామంది తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు.

Details

బీట్‌రూట్‌  మంచి ఔషధం

కొందరైతే బీట్‌రూట్‌ మొలకల్నీ తీసుకుంటున్నారు. అంతేకాదు, బీట్‌రూట్‌ ఫ్లేవర్‌తో ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు, కేకులు, క్యాండీలు, చిప్స్‌, నూడుల్స్‌ వంటి ఉత్పత్తులూ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే మన దేశంలో సుమారు 60 శాతం మంది అమ్మాయిలు, మహిళలు, పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ సమస్యను సహజంగా తగ్గించాలంటే బీట్‌రూట్‌ ఎంతో మంచి ఔషధమని నిపుణులు సూచిస్తున్నారు. మందులు కాకుండా ఆహారంతోనే ఆరోగ్యం పొందాలనుకునే వారికి, ఏడాది పొడవునా బడ్జెట్‌లో దొరికే ఈ దుంప సరైన ఎంపికగా చెబుతున్నారు.

Details

బీట్‌రూట్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే 

బీట్‌రూట్‌లో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని రోజూ లేదా క్రమం తప్పకుండా తినడం వల్ల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా అందడంతో పాటు రోజంతా చురుగ్గా ఉంచి, పలు వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని నిపుణులు అంటున్నారు. పోషకాలతో నిండిన బీట్‌రూట్‌ రసంలో అధిక స్థాయిలో ఐరన్‌ ఉంటుంది. ఈ ఐరన్‌ ఎర్ర రక్త కణాల్లోని హీమోగ్లోబిన్‌తో కలిసి శరీరమంతా ఆక్సిజన్‌ సరఫరా చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల పిల్లలు, టీనేజర్లు, గర్భిణుల్లో రక్తహీనత సమస్య తగ్గుతుందని International Journal of Nursing Education and Research జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది.

Advertisement

Details

నియంత్రణలో రక్తపోటు

బీట్‌రూట్‌లో నైట్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా అడ్డుకుంటాయని, బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందని National Library of Medicine అధ్యయనం వెల్లడించింది. ఇందులో ఉన్న అధిక పీచు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే తరచూ బీట్‌రూట్‌ తీసుకోవడం వల్ల కళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి తక్షణ శక్తిని అందించి అలసటను తగ్గిస్తుందని నిపుణుల అభిప్రాయం. బీట్‌రూట్‌ మెదడుకు రక్తప్రసరణను పెంచి బ్రెయిన్‌ హెల్త్‌కు మేలు చేస్తుంది. వయస్సుతో పాటు వచ్చే డిమెన్షియా, అల్జీమర్స్‌ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతుంది

Advertisement

Details

మలినాలను బయటకి పంపడంతో సాయపడుతుంది

కాలేయంలో పేరుకుపోయే మలినాలను బయటకు పంపించడంలో బీట్‌రూట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. గర్భిణులకు ఇచ్చే సమతుల ఆహారంలో బీట్‌రూట్‌ను తప్పనిసరిగా చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది గర్భస్థ శిశువు ఎదుగుదలకు అవసరమై, తల్లిపాల ఉత్పత్తి పెరగడానికీ దోహదం చేస్తుందని చెబుతున్నారు. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి బీట్‌రూట్‌ మంచి ఆహారం. దీన్ని తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయదని నిపుణులు అంటున్నారు. ఇందులోని బీటాలైన్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

Details

  ఎముకలను బలంగా, దృఢంగా ఉంచుతుంది

ఆరోగ్యమే కాకుండా సౌందర్య పరంగానూ బీట్‌రూట్‌ ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. చర్మం పొడిబారకుండా చూసుకోవడం, మొటిమలు రాకుండా చేయడం, మచ్చలను తగ్గించడం వంటి లాభాలు ఉన్నాయి. చర్మకాంతి పెరగడానికీ, జుట్టు నిగారింపుకూ ఇది చక్కని ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్ వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడుతుందట.

Advertisement