LOADING...
Drass: భారతదేశంలోనే అత్యంత శీతల ప్రాంతం.. ద్రాస్‌.. మంచు దుప్పటి కప్పుకొనే గ్రామం
భారతదేశంలోనే అత్యంత శీతల ప్రాంతం.. ద్రాస్‌.. మంచు దుప్పటి కప్పుకొనే గ్రామం

Drass: భారతదేశంలోనే అత్యంత శీతల ప్రాంతం.. ద్రాస్‌.. మంచు దుప్పటి కప్పుకొనే గ్రామం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

శీతాకాలం వచ్చిందంటే ఉష్ణోగ్రతలు పడిపోవడం సహజమే. మన తెలుగు ప్రాంతాల్లో పది డిగ్రీల వరకూ తగ్గినా చలికి వణికిపోతాం. అయితే ప్రపంచంలో మైనస్‌ డిగ్రీలు సాధారణమైపోయిన ప్రదేశాలు, అక్కడ నివసించే ప్రజల జీవనం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మానవులు నివసించే ప్రపంచంలో అత్యంత చల్లని ప్రాంతంగా గుర్తింపు పొందింది రష్యాలోని ఓమియాకాన్‌. అక్కడ సగటు ఉష్ణోగ్రతలే -71°C వరకు నమోదవుతుంటాయి. భారతదేశంలో అయితే లద్దాఖ్‌లోని ద్రాస్‌ గ్రామమే అత్యంత చల్లన ప్రదేశంగా నిలుస్తోంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా రెండో అత్యంత చలిగాలిగ్రామంగా ద్రాస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కార్గిల్‌ జిల్లాలో పర్వత శ్రేణుల మధ్య చిన్నగా, ప్రశాంతంగా ఉండే ఈ గ్రామాన్ని శీతాకాలంలో పూర్తిగా మంచు దుప్పటి కప్పేస్తుంది.

వివరాలు 

మంచుతో పోరాటం

శ్రీనగర్‌ నుంచి కార్గిల్‌ వైపు ప్రయాణించే వారంతా మార్గమధ్యంలో ద్రాస్‌ను తప్పక చూస్తారు. కఠినమైన వాతావరణం కారణంగా సామాన్య పర్యాటకులు ఈ కాలంలో ఇక్కడికి రావడానికి అంతగా సిద్ధపడరు. ఎందుకంటే ఇక్కడి శీతాకాల సగటు ఉష్ణోగ్రత -40°C వరకూ పడిపోతుంది. అయినా కూడా సాహస ప్రయాణాలకు ఇష్టపడే వాళ్లు ఈ కాలాన్నే ప్రత్యేకంగా ఎంచుకుంటారు. చుట్టూ తెల్లని మంచుతో నిండిన పర్వతాలు... లోయ గుండా సాగిపోతున్న ద్రాస్‌ నది... ఈ గ్రామం మొత్తాన్ని ఒక స్వర్గసుందర దృశ్యంగా మార్చేస్తాయి. శీతాకాలంలో ద్రాస్‌ పూర్తిగా గడ్డకట్టినట్టే కనిపిస్తుంది. రహదారులపై, ఇళ్లపై మంచు మందంగా కప్పేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ స్థానికులు తమ రోజువారీ జీవనాన్ని కొనసాగిస్తూ 'మంచుతో పోరాటం' చేసే ధైర్యం చూపుతుంటారు.

వివరాలు 

బటర్‌ టీ ఫేమస్‌ 

ఇక్కడి ప్రజలు బార్లీ పంటలు, పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. గాఢమైన చలికి ఎదుర్కొవడానికి ఎల్లప్పుడూ ఉన్ని దుస్తులే వాడాల్సి వస్తుంది. శరీరంలో వేడి తగ్గకుండా ఉండేందుకు వేడి టీ తరచూ తాగడం వారి అలవాటు. అత్యవసర పనులున్నప్పుడే బయటకు వెళ్లుతారు. పర్యాటకుల కోసం కొద్ది హోంస్టేలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడి బటర్‌ టీ చాలా ప్రసిద్ధి. దాన్ని తాగుతూ గ్రామ సౌందర్యాన్ని ఆస్వాదించడం సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.

వివరాలు 

సున్నపురాయితో నిర్మించిన కార్గిల్‌ వార్‌ మెమోరియల్

అమర్‌నాథ్‌ యాత్ర, సురు లోయ ట్రెక్కింగ్‌కు ఇదే ప్రారంభ కేంద్రం. ద్రాస్‌ ప్రాంతాన్ని చూసిన వారందరికీ 1999 కార్గిల్‌ యుద్ధం జ్ఞాపకమవుతుంది. ఎందుకంటే టైగర్‌ హిల్‌, టోలోలింగ్‌ పర్వతాలు, పాయింట్‌ 4875 (బత్రా టాప్‌) వంటి ప్రాంతాలు భారత సైన్యం చూపిన ధైర్యసాహసాలకు నిదర్శనంగా నిలిచాయి. గ్రామ ప్రవేశంలోనే సున్నపురాయితో నిర్మించిన కార్గిల్‌ వార్‌ మెమోరియల్‌ కనిపిస్తుంది. అక్కడ విజయ్‌పథ్‌, వీర జవాన్ల ఫొటోలు, ఆయుధాలు, యుద్ధ ఆపరేషన్‌ వివరాలు అందుబాటులో ఉంటాయి. మన్మన్‌ టాప్‌ ప్రాంతం నుంచే లద్దాఖ్‌-పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మధ్యనున్న ఎల్‌వోసీని చూడవచ్చు.

వివరాలు 

ఏడాదిలో రెండుసార్లు 

ద్రాస్‌ను సంవత్సరంలో రెండు ఋతువులలో దర్శించుకోవచ్చు. అక్టోబర్‌ నుంచి మార్చి వరకు వెళ్తే -40°C చలితో పాటు ప్రతిచోటా మంచు రాజ్యం కనబడుతుంది. ఈ కాలం సాహసప్రియులకు ఎంతో అనుకూలం. మరోవైపు జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు అయితే ఈ గ్రామం పచ్చని దృశ్యాలతో, పూవులతో నిండిపోతుంది. ఈ కాలం సాధారణ పర్యాటకులకు అనువైనదిగా భావిస్తారు. ద్రాస్‌ చేరాలంటే లేహ్‌ విమానాశ్రయానికి చేరి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు. రైల్వే ప్రయాణం చేయాలనుకుంటే జమ్మూ-తావి స్టేషన్‌ నుంచి శ్రీనగర్‌ మార్గంలో ఈ గ్రామం దారిలో వస్తుంది. శ్రీనగర్‌-కార్గిల్‌ రహదారిలో నడిచే బస్సులు, వాహనాలన్నీ ద్రాస్‌ మీదుగానే ప్రయాణిస్తాయి.