ఆల్కహాల్ వల్ల కలిగే కాలేయ వ్యాధులు: ఈ సంకేతాలు కనిపిస్తే డేంజర్ బెల్స్ మోగినట్టే
మన శరీరంలోని అతిపెద్ద గ్రంథి కాలేయం. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే ఆహార జీర్ణక్రియలో తోడ్పడి ఆహారంలోని పోషకాలను శరీరానికి అందిస్తుంది. అలాగే కాలేయానికి ఓ లక్షణం ఉంది. కాలేయం దానికదే పునర్ వృద్ధి చెందుతుంది. అంటే కాలేయాన్ని సగభాగం కోసివేస్తే దానికదే మళ్ళీ పూర్తిగా రూపుదిద్దుకుంటుంది. ఇది మన శరీరంలోని కాలేయం ఒక్కదానికే ఉన్న లక్షణం. ఐతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. దానివల్ల శరీరానికి అనేక నష్టాలు కలుగుతాయి. ఆల్కహాల్ కారణంగా కాలేయం దెబ్బతింటుందని కొన్ని సంకేతాల వల్ల తెలుసుకోవచ్చు. కడుపు నొప్పి, వికారం, వాంతులు, డయేరియా, నీరసంగా అనిపించడం, ఆకలి లేకపోవడం మొదలగు లక్షణాలు ఆల్కహాల్ వల్ల కాలేయం పాడవుతుందని ముందుగానే తెలియజేస్తాయి.
ఆల్కహాల్ వల్ల్ కాలేయం ఎక్కువగా పాడైతే వచ్చే లక్షణాలు
కాలేయం బాగా పాడైతే కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. పచ్చకామెర్లు రావడం, కడుపు, అరికాళ్ళు, చీలమండ మొదలగు భాగాలు ఉబ్బడం, జ్వరం, వణుకు ఉంటాయి. ఇంకా నిద్రలేకపోవడం, చర్మం దురద పెట్టడం, జుట్టు ఊడిపోవడం, అమాంతం బరువు తగ్గడం, బలహీనంగా మారిపోవడం, వాంతుల్లో రక్తం రావడం, ఆల్కహాల్, డ్రగ్స్ లేకుండా ఉండకపోవడం ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు ఆల్కహాల్ తాగడం ఆపేయాలి. లేదంటే అది ప్రాణాంతక వ్యాధిగా మారే అవకాశం ఉంది. మందు తాగకుండా ఉండని పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ ని కలవడం మంచిది. డాక్టర్ల సలహా ప్రకారం ఆల్కహాల్ తీసుకునే అలవాటును నెమ్మది నెమ్మదిగా తగ్గించుకుంటూ ఆ తర్వాత పూర్తిగా మానేయాలి.