Loading...
Air pollution: ఊపిరితిత్తులకే కాదు.. గుండెపైనా కాలుష్య ప్రభావం.. వైద్యుల హెచ్చరిక!
ఊపిరితిత్తులకే కాదు.. గుండెపైనా కాలుష్య ప్రభావం.. వైద్యుల హెచ్చరిక!

Air pollution: ఊపిరితిత్తులకే కాదు.. గుండెపైనా కాలుష్య ప్రభావం.. వైద్యుల హెచ్చరిక!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీతో పాటు పరిసర ప్రాంతాలను వాయు కాలుష్యం తీవ్రంగా వేధిస్తోంది. దీపావళి తర్వాత ఏర్పడిన పొగమంచు (స్మాగ్) ఇంకా తగ్గకపోవడంతో గాలి నాణ్యత రోజురోజుకూ పడిపోతోంది. ఇటీవల గాలి నాణ్యత సూచీ (AQI) తీవ్ర స్థాయికి చేరగా.. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పేలవం నుంచి అత్యంత పేలవమైన స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల కేవలం ఊపిరితిత్తుల సమస్యలే కాకుండా.. గుండె, రక్తనాళాలపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

వివరాలు 

కాలుష్యంతో దీర్ఘకాలిక అనారోగ్య ముప్పు!

ఢిల్లీలోని సాకేత్‌లో ఉన్న మ్యాక్స్ స్మార్ట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇంటర్నల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్‌ఎస్ మిశ్రా ఈ అంశంపై కీలక విషయాలు వెల్లడించారు.

వాయు కాలుష్యాన్ని కేవలం కొన్ని రోజుల పాటు ఉండే కాలానుగుణ సమస్యగా చూడకూడదని, ఇది అన్ని వయసుల వారినీ ప్రభావితం చేస్తున్న తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారిందని పేర్కొన్నారు.

కాలుష్యం కారణంగా దగ్గు, గొంతులో మంట, కళ్లలో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వెంటనే కనిపిస్తాయని వివరించారు.

అయితే గాలిలో ఉండే అతి సూక్ష్మమైన కాలుష్య కణాలు శరీరంలోకి ప్రవేశించి మరింత తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని డాక్టర్ మిశ్రా హెచ్చరించారు.

వివరాలు 

గుండెపోటు,పక్షవాతం ముప్పు.. పిల్లలు,గర్భిణులు మరింత జాగ్రత్త!

ముఖ్యంగా పీఎం2.5 (PM2.5)కణాలు చాలా చిన్నవిగా ఉండటంతో ఊపిరితిత్తుల లోతు వరకు చేరడమే కాకుండా రక్తంలోనూ కలుస్తాయని తెలిపారు.

దీనివల్ల శరీరంలో వాపు(ఇన్‌ఫ్లమేషన్)ఏర్పడటంతో పాటు గుండె, రక్తనాళాలపై అదనపు ఒత్తిడి పడుతుందని చెప్పారు.

కాలుష్యానికి ఎక్కువ కాలం గురికావడం వల్ల గుండెపోటు, పక్షవాతం,ఇతర గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆయన వివరించారు.

ఇప్పటికే గుండె జబ్బులు,అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

చిన్నారుల ఊపిరితిత్తులు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉండటం వల్ల వారిపై కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

వృద్ధులు,గర్భిణులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

ముఖ్యంగా గర్భిణుల్లో కాలుష్యం కారణంగా గర్భధారణకు సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ADVERTISEMENT

వివరాలు 

కాలుష్యానికి కారణాలివే.. రక్షణకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

దీపావళి టపాసుల పొగ, వాహనాల నుంచి వెలువడే పొగ, నిర్మాణ పనుల వల్ల వచ్చే దుమ్ము, చెత్తను కాల్చడం వంటి కారణాలు కాలుష్యాన్ని పెంచుతున్నాయని డాక్టర్ మిశ్రా తెలిపారు.

వీటికి తోడు ఉష్ణోగ్రతలు తగ్గడం,గాలి వేగం తక్కువగా ఉండటంతో కాలుష్య కారకాలు భూమికి సమీపంలోనే పేరుకుపోతున్నాయని వివరించారు.

దీంతో కొద్ది గంటల్లోనే గాలి నాణ్యత గణనీయంగా పడిపోతోందని పేర్కొన్నారు.

కాలుష్యం నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.

ఉదయం,సాయంత్రం వేళల్లో బయట వ్యాయామాలకు వెళ్లకూడదని సూచించారు.

కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇంటి కిటికీలు మూసి ఉంచాలని సూచించారు.

బయటకు వెళ్లాల్సి వస్తే ముఖానికి సరిగ్గా సరిపోయే ఎన్‌95 (N95) మాస్కులు ధరించాలని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

స్వచ్ఛమైన గాలి అందరి బాధ్యత!

సాధారణ గుడ్డ మాస్కులు, వదులుగా ఉండే సర్జికల్ మాస్కులు సూక్ష్మ కాలుష్య కణాలను అడ్డుకోవడంలో సరైన రక్షణ ఇవ్వలేవని స్పష్టం చేశారు.

ఆస్తమా, సీఓపీడీ (COPD) వంటి శ్వాసకోశ సమస్యలున్న వారు వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలని, ఇన్‌హేలర్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.

ఛాతీలో అసౌకర్యం,సాధారణం కంటే ఎక్కువ అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని కాలుష్యం వల్ల వచ్చిన సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

వివరాలు 

స్వచ్ఛమైన గాలి అందరి బాధ్యత!

వాహనాలు, పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు విధానపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని డాక్టర్ మిశ్రా పిలుపునిచ్చారు.

స్వచ్ఛమైన గాలి విలాసం కాదని, ఆరోగ్యంగా జీవించడానికి అది ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు.

గాలిని కాలుష్యం నుంచి కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.

ADVERTISEMENT