Eggless Ragi Banana Bread Recipe: ఉదయాన్నే సులువుగా చేసుకునే హెల్తీ రాగి బనానా బ్రెడ్.. టైమ్ లేకపోయినా చేసేయచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
ఉదయం లేవగానే ఇంట్లో వాళ్లందరికీ ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే టిఫిన్ తయారు చేయాలనే ఆలోచన చాలా మంది తల్లుల్లో ఉంటుంది. కానీ సమయం సరిపోకపోవడంతో తొందరపాటు, ఒత్తిడి పెరుగుతుంటాయి. ఉదయాన్నే వేగంగా లేచి వంట చేయడం చాలామందికి కష్టంగా మారుతుంది. అలాంటి వారికి చేయడం సులువు, తినడానికి రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసే రాగి ఆధారిత ప్రత్యేక టిఫిన్ రెసిపీని ఇప్పుడు పరిచయం చేస్తున్నాం.
వివరాలు
ఎగ్ లేకుండా, కేవలం రాగితో హెల్తీ బనానా బ్రెడ్
ఉదయం హోటల్‌లో బఫే బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్తే ఒక ప్రత్యేకమైన సువాసన మనసును వెంటనే ఆకర్షిస్తుంది. వేడివేడిగా, మెత్తగా, స్వల్ప తీయదనంతో ఉండే బనానా బ్రెడ్ కనిపించగానే రుచి చూడాలనిపిస్తుంది. ఒక కప్పు వేడి టీతో బ్రెడ్ ముక్కను నంచుకుని తింటే... ఆ అనుభూతి నిజంగా మరిచిపోలేనిది. సాధారణంగా ఈ బ్రెడ్‌లో ఆరోగ్యానికి మంచివైన పదార్థాలే ఉన్నా, ఎక్కువగా మైదా వాడుతారు. అయితే మైదాకు బదులుగా గోధుమపిండి, రాగిపిండి ఉపయోగిస్తే రుచి తగ్గకుండా, పోషక విలువలు మరింత పెరుగుతాయి. అందుకే ఈరోజు ఎగ్ లేకుండా, కేవలం రాగితో హెల్తీ బనానా బ్రెడ్ తయారు చేసుకుందాం.
వివరాలు
కావలసిన పదార్థాలు:
గోధుమపిండి - 1 కప్పు రాగిపిండి - అర కప్పు పాలపొడి - అర కప్పు బాగా పండిన పెద్ద అరటిపండ్లు - 3 (లేదా చిన్నవైతే 4) వాసనలేని నూనె - అర కప్పు తేనె - 2/3 కప్పు బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్ బేకింగ్ సోడా - 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి - 1 టీస్పూన్ జాజికాయ పొడి - అర టీస్పూన్ ఉప్పు - చిటికెడు బాదం, అక్రోట్ పొడి - అర కప్పు
వివరాలు
తయారీ విధానం:
ముందుగా ఒక పాత్రలో గోధుమపిండి, రాగిపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి, ఉప్పు అన్నింటిని వేసి జల్లెడ పట్టాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ ఎంతో మెత్తగా వస్తుంది. ఇప్పుడు అరటిపండ్లను బాగా మెదిపి పేస్ట్‌లా చేసుకుని, అందులో తేనె, నూనె వేసి బాగా కలపాలి. తర్వాత పాలపొడి కలిపి మిశ్రమం ముద్దలా అయ్యే వరకు కలపాలి. ఆపై ముందుగా సిద్ధం చేసిన పిండిమిశ్రమాన్ని కొద్దికొద్దిగా జోడిస్తూ మెల్లగా కలపాలి. ఎక్కువగా కలపకుండా జాగ్రత్త పడాలి. చివరగా డ్రై ఫ్రూట్స్ పొడి వేసి స్వల్పంగా మిక్స్ చేయాలి.
వివరాలు
తయారీ విధానం:
ఈ మిశ్రమాన్ని ముందుగానే నూనె రాసిన బ్రెడ్ టిన్‌లో పోసి, ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి సుమారు ఒక గంట పాటు బేక్ చేయాలి. మధ్యలో టూత్‌పిక్ పెట్టి పరీక్షించాలి. బయటకు తీసినప్పుడు టూత్‌పిక్ శుభ్రంగా ఉంటే బ్రెడ్ సిద్ధమైనట్టే. కొద్దిసేపు చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేస్తే... లోపల మెత్తగా, బయట గోధుమరంగులో మెరిసే హెల్తీ రాగి బనానా బ్రెడ్ సిద్ధం!