రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)
అటవీ ప్రాంతంలో ఉండే రైల్వే ట్రాకును దాటేటప్పుడు కొన్ని ఏనుగులు గాయపడడం, చనిపోవడం లాంటి ఎన్నో ఘటనలను చూస్తుంటాం. గజరాజుల గుంపును గమనించి లోకో పైలట్లు రైలు బ్రేకులు వేస్తున్నప్పటికీ అప్పటికే సమయం మించిపోయి ప్రమాదాలు జరిగిపోతున్నాయి. అయితే వీటిని నివారించేందుకు అధికారులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ ప్రాంతాల్లో క్రాసింగ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించేలా అధికారులు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అస్సాం అటవీశాఖ అధికారులు ఏనుగులను దాటించేందుకు వినూత్న ఆలోచన చేశారు. ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటేందుకు అధికారులు ఓ ర్యాంప్ ను ఏర్పాటు చేశారు. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో రీషేర్ చేసిన వీడియో ప్రస్తుతం జంతుప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది.
గ్రీన్ కారిడార్ గా ప్రకటించాలి
ఈ వీడియోలో ఏనుగులు సులభంగా, సురక్షితంగా రైల్వే ట్రాక్ ను దాటేందుకు అధికారులు ఏర్పాటు చేసిన ర్యాంప్ మనకు కనిపిస్తుంది. ఏనుగులు గుంపు రాణి రిజర్వ్ ఫారెస్టును చేరుకునేందుకు డీపర్ బీల్ నుంచి మికిర్పర కారిడార్ ను దాటుతున్నాయని ఒరిజినల్ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. ముఖ్యంగా రైల్వే ట్రాకులపై ఏనుగుల మరణాలను తగ్గించేందుకు సమర్ధవంతమైన ఏర్పాటు అని సుశాంత నంద ఈ పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టు ఆన్‌లైన్‌లో షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. ఏనుగులు నిత్యం ఉపయోగించే ఈ మార్గాలను గ్రీన్ కారిడార్ గా ప్రకటించాలని కొందరు నెటిజన్లు సూచించారు.