Karthikamasam Special: పంచభూతాల శివక్షేత్రాలు..ఐదు తత్త్వాల దివ్య రహస్యం.. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శివక్షేత్రాల్లో ఐదు ప్రదేశాలను పంచభూతాల క్షేత్రాలుగా పిలుస్తారు. ఇవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే ఐదు భౌతిక తత్త్వాలను సూచిస్తాయి. ప్రతి క్షేత్రంలో శివుడు ఈ తత్త్వాలలో ఒకదానిగా దర్శనమిస్తాడు. సంవత్సరం పొడవునా భక్తుల రద్దీతో ఉండే ఈ దేవాలయాలు, ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతుండటంతో మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటాయి. ఈ ఐదు పవిత్ర స్థలాల్లో ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. ఇప్పుడు ఆ పంచభూతాల క్షేత్రాలు ఎక్కడున్నాయి, వాటి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.
వివరాలు
1. కాంచీపురం (తమిళనాడు) - పృథ్వి లింగం
భూమి తత్త్వాన్ని సూచించే 'పృథ్వి లింగం' కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయంలో స్థాపించబడి ఉంది. ఇది ఆ పట్టణంలోని అతి పెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి. ద్రావిడ శిల్పకళా వైభవానికి నిదర్శనమైన ఈ ఆలయం విస్తారమైన చెరువుతో, పచ్చదనంతో నిండిన పరిసరాలతో భక్తుల మనసును దోచేస్తుంది. శివుడు ఇక్కడ భక్తులకు స్థిరత్వం, సంతాన ప్రాప్తి, శ్రేయస్సు ప్రసాదిస్తారని నమ్మకం.
వివరాలు
2. తిరువానైకావల్ (తమిళనాడు) - జల లింగం
కావేరి నదికి సమీపంలో ఉన్న జంబుకేశ్వర ఆలయం'జల లింగం'కు ప్రసిద్ధి. నీటి తత్త్వాన్ని సూచించే ఈ లింగం ఎప్పుడూ తడి తడిగానే ఉంటుంది అని చెబుతారు. ఈ పురాతన దేవాలయం దాని విశిష్ట నిర్మాణ శైలితో పాటు పవిత్రమైన నీటి కొలను వల్ల ప్రసిద్ధి చెందింది. భక్తులు ఇక్కడకు శుద్ధి, భావోద్వేగ స్థిరత్వం,ఆధ్యాత్మిక శాంతి కోసం విచ్చేస్తారు. 3. తిరువన్నమలై (తమిళనాడు)-అగ్ని లింగం అరుణాచలేశ్వర ఆలయం 'అగ్ని లింగం'ను ప్రతిబింబిస్తుంది.ఇది అరుణాచల పర్వతం పాదాల వద్ద ఉంది. ఇక్కడ శివుడు అగ్ని రూపంలో దర్శనం ఇస్తూ,ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని విశ్వసిస్తారు. ఈ ఆలయం దైవిక శక్తిని ప్రసరింపజేస్తూ,జ్ఞానోదయం,విముక్తి కోరుకునే భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆలయ శిల్పకళ,ప్రశాంత వాతావరణం మనసును పరవశింపజేస్తాయి.
వివరాలు
4. శ్రీకాళహస్తి (ఆంధ్రప్రదేశ్) - వాయు లింగం
తెలుగు రాష్ట్రాల్లోని ఏకైక పంచభూత క్షేత్రం శ్రీకాళహస్తి. ఇక్కడ శివుడు 'వాయు లింగం'గా వెలసాడు. ఈ లింగం ఎప్పుడూ గాలి ప్రవాహాన్ని సూచిస్తూ కంపిస్తుందని చెబుతారు. అద్భుత గోపురాలు, అద్భుతమైన శిల్పకళతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని ఆలోచనా స్పష్టత, తెలివితేటలు, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం భక్తులు దర్శించుకుంటారు. 5. చిదంబరం (తమిళనాడు) - ఆకాశ లింగం పంచభూతాల్లో చివరిది 'ఆకాశ లింగం'. ఇది చిదంబరం తిల్లై నటరాజ ఆలయంలో దర్శనమిస్తుంది. నటరాజ స్వామికి అంకితమైన ఈ ఆలయం, శివుడి కాస్మిక్ నృత్యం (ఆనంద తాండవం)కు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తూ, శివుని విశ్వ నాట్యాన్ని దర్శించుకోవడానికి వస్తారు.