LOADING...
#SankranthiSpecial: భోగి నుంచి కనుమ వరకూ.. సంక్రాంతి పండుగ వెనుక ఉన్న సంప్రదాయాలు, ప్రత్యేకతలు ఇవే!
భోగి నుంచి కనుమ వరకూ.. సంక్రాంతి పండుగ వెనుక ఉన్న సంప్రదాయాలు, ప్రత్యేకతలు ఇవే!

#SankranthiSpecial: భోగి నుంచి కనుమ వరకూ.. సంక్రాంతి పండుగ వెనుక ఉన్న సంప్రదాయాలు, ప్రత్యేకతలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2026
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ప్రధాన పండుగల్లో 'సంక్రాంతి' అగ్రస్థానంలో నిలుస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమగా మూడు రోజుల పాటు జరిగే ఈ మహా పండుగ.. సంప్రదాయాలు, ఆచారాలు, కళా ప్రదర్శనలు, విందులు, వినోదాలతో తెలుగు నేలంతా సంబరంగా మారుతుంది. ఆడబిడ్డల హడావుడి, అల్లుళ్ల సందడి, బావామరదళ్ల సరాగాలతో గ్రామాలూ, పట్టణాలూ కళకళలాడుతాయి. సూర్యుడు ప్రతి నెలా ఒక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ఏడాదికి 12 సంక్రాంతులు వచ్చినా, పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినాన్ని మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఈ రోజుతో ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమవుతుందని హిందూ ధర్మంలో విశ్వాసం. అందుకే మకర సంక్రాంతిని అత్యంత పవిత్రమైన పండుగగా ఘనంగా జరుపుకుంటారు.

Details

ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారడమే మకర సంక్రాంతి

రవి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారడమే మకర సంక్రాంతి. సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తర దిశగా ప్రయాణించడాన్ని ఉత్తరాయనం, దక్షిణ దిశగా సాగడాన్ని దక్షిణాయనం అంటారు. స్కాంధ పురాణం ప్రకారం ధనుస్సు నుంచి కర్కాటక రాశివరకు దేవతలకు పగలు, మిగతా కాలం రాత్రి. ఉత్తరాయనం దేవతలకు పగలు కావడంతో ఈ కాలంలో యజ్ఞయాగాదులు చేసి దైవానుగ్రహం పొందాలని శాస్త్రాలు సూచిస్తాయి. అందుకే భీష్ముడు కూడా ఉత్తరాయన పుణ్యకాలంలోనే స్వచ్ఛంద మరణాన్ని కోరుకున్నాడు. ధనుర్మాసం అంతా ఇంటి ముందు రంగవల్లులు వేయడం ఆనవాయితీ.

Details

 భోగి

భోగి నాడు తెల్లవారుజామున పాత కర్రలు, పుల్లలు, పిడకలు, కొబ్బరి మట్టలతో పెద్ద మంటలు వేస్తారు. వీటినే భోగి మంటలు అంటారు. పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేయడం ద్వారా పాత అలవాట్లు, చెడు ఆలోచనలను కూడా విడిచిపెట్టి కొత్త జీవనానికి అడుగుపెడతామని అర్థం. గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగి మంట వేయడం వల్ల సామూహిక ఐక్యత ఏర్పడుతుంది. భోగి రోజున పిల్లలకు తలంటు స్నానం చేయించడం ఎంతో ప్రాముఖ్యం. నువ్వుల నూనెను బ్రహ్మరంధ్రంపై రాసి, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయిస్తారు. ఇది చైతన్యాన్ని కలిగిస్తుందని పెద్దల నమ్మకం. అనంతరం నూతన వస్త్రధారణ చేసి, పాయసం వండుతారు.

Advertisement

Details

సాయంత్రం పిల్లలపై భోగి పళ్లు పొస్తారు

సాయంత్రం పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. రేగిపళ్లు, రాగి పైసలు, పూలను కలిపి పిల్లల తలపై పోయడం వల్ల దృష్టిదోషం పోతుందని విశ్వాసం. చివరగా పేరంటాళ్లకు వాయనం ఇస్తారు. రేగు చెట్టును బదరీ వృక్షం అంటారు. రేగిపండు సంస్కృతంలో 'అర్కఫలం' — అర్క అంటే సూర్యుడు. సూర్యుని పోలిన ఈ పండు పిల్లలపై పోయడం ద్వారా వారికి సూర్యశక్తి ప్రసాదించాలని పెద్దల ఆశీర్వాదం. భోగి రోజున గుమ్మడికాయ వంటకాలు ప్రత్యేకం. భోగి ఇంద్రుడికి ప్రీతికరమైన రోజు. శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఇంద్రుడు తన పదవిని తిరిగి పొందిన రోజుగా కథనం.

Advertisement

Details

పొంగలి చేసి ఇంద్రుడికి, విష్ణువుకు నైవేద్యం

ఈ రోజున కొత్త ధాన్యంతో పొంగలి చేసి ఇంద్రుడికి, విష్ణువుకు నైవేద్యం సమర్పిస్తారు. వామనావతారంలో భోగి నాడే బలిచక్రవర్తిని పాతాళానికి పంపినట్లు పురాణకథ. అందుకే వామన పూజ కూడా ఆచారం. భోగి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన పండుగ. ధనుర్మాస వ్రతంతో సంతుష్టుడైన రంగనాథుడు భోగి నాడే భూలోకానికి అవతరించి ఆండాళ్లమ్మను చేపట్టాడని విశ్వాసం. భోగీంద్రుడు అంటే ఆదిశేషుడు. అందుకే హరికి భోగీంద్రశయనుడు అనే పేరు వచ్చింది.

Details

సంక్రాంతి

సంక్రాంతి ప్రధాన పండుగ. తొలిపంట ఇంటికి రావడం రైతులకు అపార ఆనందాన్ని ఇస్తుంది. పంటపొలాల పచ్చదనం, రాబోయే దిగుబడి చూసి అన్నదాత హృదయం పరవశిస్తుంది. శ్రమకు, సంపదకు విలువ ఇచ్చే ఈ పండుగను బీద-గొప్ప తేడా లేకుండా అందరూ ఘనంగా జరుపుకుంటారు.

Details

సంక్రాంతి దానాలు 

సంక్రాంతి నాడు చేసే దానాలు అనేక జన్మలకు ఫలితాన్ని ఇస్తాయని పెద్దల నమ్మకం. ఈ రోజున ఎవరి ఇంటా 'లేదు' అనే మాట రాకూడదు. ధాన్యం, గోవులు, కంచు, బంగారం దానం శ్రేష్ఠం. వీలు లేనివారు నువ్వులు, నెయ్యి, వస్త్రాలు దానం చేయాలి. గుమ్మడికాయ దానం చేయడం భూదానం చేసినంత ఫలితం ఇస్తుందని చెబుతారు. ఈ మూడు రోజులు బలిచక్రవర్తి భూమిని పాలిస్తాడనే విశ్వాసంతో దానధర్మాలు చేస్తారు. దక్షిణాయనం ముగిసిన సందర్భంగా పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు.

Details

గొబ్బెమ్మలు

గోపి శబ్దం నుంచి గొబ్బి, గొబ్బెమ్మ అనే పదాలు వచ్చాయని పెద్దలు చెబుతారు. కన్నెపిల్లలు గోపికలుగా భావించి గొబ్బెమ్మల చుట్టూ వలయంగా తిరుగుతూ పాటలు పాడతారు. కొందరు గొబ్బెమ్మలను సూర్యుడు, గ్రహాలకు ప్రతీకగా చెబుతారు. గౌరిదేవిగా భావించి చివరి రోజున సందె గొబ్బెమ్మ పెడతారు. ఇలా చేస్తే మంచి వరుడు దొరుకుతాడన్న నమ్మకం ఉంది. గొబ్బెమ్మలను పిడకలుగా చేసి, వాటి మీద పాయసం వండి భగవంతునికి నైవేద్యం చేస్తారు.

Details

గొబ్బి పాటలు

ముగ్గుల మధ్య గొబ్బెమ్మల చుట్టూ పిల్లలు పాడే గొబ్బి పాటలు పండుగకు ప్రత్యేక ఆకర్షణ. సంక్రాంతి ముగ్గులు - అంతరార్థం హేమంత ఋతువులో చలి ఎక్కువగా ఉండటం వల్ల క్రిమికీటకాల ప్రమాదం ఉంటుంది. దాన్ని నివారించేందుకు పేడనీళ్లు చల్లి, సున్నంతో ముగ్గులేయడం ఆరోగ్యకరం. వంగి ముగ్గులు వేయడం శరీరానికి వ్యాయామం, జ్ఞాపకశక్తికి మేలు చేస్తుంది. హరిదాసులు, గంగిరెద్దులు సంక్రాంతి రోజున హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల సందడి, కోలాటాలు గ్రామాలను ఉత్సవంగా మారుస్తాయి. హరిదాసుల వేషధారణ, గాత్రం, భక్తిరసం అందరికీ వీనుల విందు. గంగిరెద్దుల అలంకారం, జానపద కళాకారుల ప్రదర్శనలు పండుగకు శోభనిస్తాయి.

Details

కనుమ

కనుమను పశువుల పండుగగా జరుపుకుంటారు. పశువులను కడిగి, అలంకరించి పూజ చేస్తారు. మినప గారెలు ఈ రోజు ప్రత్యేక వంటకం. పితృదేవతలు కాకి రూపంలో వచ్చి గారెలను స్వీకరిస్తారని నమ్మకం. అందుకే 'కనుమ నాడు కాకి కూడా కదలదన్న సామెత వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో పొంగలి చేసి పొలాల్లో చల్లడం, గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొట్టడం ఆనవాయితీ. సంక్రాంతి భోగి, కనుమలతో కలిసి రాకుమార్తెలా వచ్చి... మన పూజలు, నైవేద్యాలు స్వీకరించి అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఆశీర్వదిస్తుందని విశ్వాసం.

Advertisement