Sankranti 2026 Dates : భోగి నుంచి కనుమ వరకు… 2026 సంక్రాంతి పర్వదినాల పూర్తి షెడ్యూల్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లికలు, భోగి మంటల వెలుగు, కొత్త బట్టలు, పిండి వంటల సువాసన, గాలిపటాలతో పరుగులు తీస్తున్న పిల్లలు, బొమ్మల కొలువులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడిపందేళ్ల సందడి... ఇలా సంక్రాంతి పండుగ అంటే ఆనందం, సంబరం, భావోద్వేగం. అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ పండుగ 2026లో ఎప్పుడు వస్తుంది? దాని విశిష్టత ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
Details
సంక్రాంతి—ఉత్తరాయణం ప్రారంభ సూచిక
కాలచక్రానికి అధిపతి సూర్యుడు. ఆయన దక్షిణాయనం, ఉత్తరాయనం అనే రెండు మార్గాల్లో సంచరిస్తూ ऋతువులను నడిపిస్తాడు. ప్రతీ సంవత్సరం జనవరిలో జరిగే సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ సమయంలో పంటలు చేతికొస్తాయి. అందుకే సూర్యారాధనతో పాటు నేలతల్లికి రంగవల్లికలు, పూలతో ప్రత్యేక పూజలు చేస్తాం. భోగితో ప్రారంభమై, కనుమతో ముగిసే ఈ మూడు రోజుల పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి 2026 తేదీలు జనవరి 13, మంగళవారం - భోగి పండుగ (Bhogi 2026) జనవరి 14, బుధవారం - ఉత్తరాయణం ప్రారంభం, మకర సంక్రాంతి (Makar Sankranti 2026) జనవరి 15, గురువారం - కనుమ పండుగ (Kanuma 2026)
Details
జనవరి 13 (భోగి పండుగ)
సంక్రాంతి పండుగ భోగితో మొదలవుతుంది. అధిక చలి కారణంగా తెల్లవారుజామునే భోగి మంటలు వేసే సంప్రదాయం ఉంది. ఈ రోజుతోనే ధనుర్మాసం ముగుస్తుందని పురాణాలు చెబుతాయి. గోదాదేవి రంగనాథుని తిరుప్పావై పాశురాలతో ఆరాధించి, భోగి రోజుననే స్వామితో లీనమవ్వడం వలన ఈ పండుగ ఉద్భవించిందన్న కథనమూ ఉంది. భోగి రోజున ఆవుపేడ పిడకపై కొత్త బియ్యం, బెల్లం, పాలతో తయారుచేసిన పొంగలి సూర్యభగవానుడికి నివేదిస్తారు. సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పళ్లు వేయడం కూడా ఒక పరంపర. తెలంగాణలో 'భోగినోము' అనే ప్రత్యేక వ్రతాన్ని పాటిస్తారు. నువ్వులుండలు, జీడిపప్పు, చెరకు ముక్కలు, చిల్లర డబ్బులు నింపిన మట్టి కుండలను పొరుగువారికి వాయినాలుగా ఇస్తారు.
Details
జనవరి 14 (మకర సంక్రాంతి)
భోగి తర్వాత వచ్చే ప్రధాన పండుగ మకర సంక్రాంతి. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీనిని మకర సంక్రమణం అని కూడా పిలుస్తారు. ఇదే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినం. ఈ రోజు చేసే దానం అత్యంత పుణ్యఫలాలను అందిస్తుందన్న విశ్వాసం ఉంది. గుమ్మడికాయ దానం పితృదేవతలను ప్రసన్నం చేస్తుందని, ఏ రూపంలోనైనా నువ్వులు తీసుకుంటే ఆయుష్షు, ఆరోగ్యం పెరుగుతాయని చెబుతారు. శాస్త్రాల ప్రకారం తెల్లనువ్వులు దేవతార్పణానికి, నల్ల నువ్వులు పితృతర్పణానికి ఉపయోగిస్తారు.
Details
జనవరి 15 (కనుమ పండుగ)
కనుమని మేష సంక్రాంతిగా కూడా అంటారు. ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చేయాలనే భావనను ఈ పండుగ ప్రతిబింబిస్తుంది. మనుషుల జీవితానికి పునాదిగా నిలిచే పశువులకు కృతజ్ఞత తెలుపడం కనుమ ప్రధాన ఉద్దేశ్యం. ఈ రోజు రైతులు పశుశాలను శుభ్రపరచి, గోవులు-గేదెలకు పసుపు, కుంకుమ పెట్టి పూలమాలలతో అలంకరిస్తారు. సాయంత్రం మేళతాళాలతో వాటిని ఊరేగించడం ఆనవాయితీ. ముఖ్య గమనిక ఈ విషయాలన్నీ మతపరమైన విశ్వాసాలు, పురాణ కథనాలు, కొందరు ఆచార్యులు పేర్కొన్న వివరాల ఆధారంగా తెలుపుతున్నాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఎంతవరకు విశ్వసించాలో పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం.