Year Ender 2025: ఆహార నియమాల నుండి మందుల వరకు: ఆయుర్వేదంపై ఉన్న అపోహలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ఈరోజుల్లో కూడా ఆయుర్వేదం కోట్లాది మందికి దారి చూపుతోంది. అయితే, శాస్త్రం చెప్పే నిజాలకు సరిపోని అభిప్రాయాలు ఇప్పటికీ తరచూ వినిపించడం ఆశ్చర్యమే. సంప్రదాయ భావనలను సరైన నేపథ్యం లేకుండా అర్థం చేసుకోవడం,లేదా సోషల్ మీడియాలో ట్రెండ్స్ పేరుతో వాటిని చాలా సరళంగా చూపించడం వల్లే ఇలాంటి అపోహలు ఏర్పడుతున్నాయని జివా ఆయుర్వేద వ్యవస్థాపకుడు,మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఆయుర్వేదాచార్యుడు, రచయిత డాక్టర్ ప్రతాప్ చౌహాన్ చెబుతున్నారు. మన ఆరోగ్యానికి నిజంగా ఉపయోగపడేది ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా ఈ అపోహలను తొలగించుకోవడం చాలా అవసరమని ఆయన అభిప్రాయం. వాస్తవాలను దగ్గరగా పరిశీలిస్తే,ఆయుర్వేదం గురించి ప్రచారంలో ఉన్న అపోహల కంటే ఇది ఎంతో ఆచరణాత్మకంగా,ఖచ్చితంగా పనిచేసే వైద్య విధానమని అర్థమవుతుందని డాక్టర్ ప్రతాప్ చౌహాన్ పేర్కొన్నారు.
వివరాలు
అపోహ-1: చిన్న సమస్యలకే ఆయుర్వేదం పనికొస్తుంది
చాలా మందికి ఆయుర్వేదం తేలికపాటి సమస్యలకే ఉపయోగపడుతుందనే భావన ఉంది. కానీ నిజానికి, దీర్ఘకాలికంగా కొనసాగుతున్న క్లిష్టమైన వ్యాధులకు కూడా ఆయుర్వేదంలో స్పష్టమైన చికిత్సా విధానాలు ఉన్నాయి. ఆధునిక వైద్య పరీక్షలను ఉపయోగించుకుంటూనే, కోలుకునే ప్రక్రియకు తోడ్పడే ఆయుర్వేద చికిత్సలను అనుసరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అపోహ-2: ఆయుర్వేద మందులు చాలా నెమ్మదిగా పనిచేస్తాయి ఇది ఇప్పటికీ చాలామంది నమ్మే అపోహ. కొన్ని చికిత్సలు క్రమంగా ఫలితం ఇస్తాయి కానీ, చాలా సందర్భాల్లో ఊహించిన దానికంటే త్వరగానే ఉపశమనం లభిస్తుంది. ఫలితాల వేగం మీ ఆరోగ్య సమస్య, జీర్ణశక్తి, జీవనశైలి, వైద్యుల సూచనలను ఎంతవరకు పాటిస్తున్నారన్నదానిపై ఆధారపడి ఉంటుంది.
వివరాలు
అపోహ-3: ఇంటి చిట్కాలు, ఆయుర్వేదం రెండూ ఒకటే
వంటింటి చిట్కాలకు, శాస్త్రీయ ఆయుర్వేద చికిత్సకు చాలా తేడా ఉంది. ఇంటి చిట్కాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వవచ్చు. కానీ సరైన ఆయుర్వేద చికిత్సలో మీ దోషాలు, జీర్ణశక్తి, వయసు, వ్యాధి దశ వంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. అపోహ-4: ఆయుర్వేదం అంటే మనకు అలవాటైన ఆహారాలన్నీ మానేయాలి అయుర్వేదం సహజంగానే కఠిన నియమాలు పెట్టదు. ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవడం, సరైన కలయికలు పాటించడమే దీని లక్ష్యం. ఎక్కువ మందికి పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా, చిన్నచిన్న ఆచరణాత్మక మార్పులే సరిపోతాయి.
వివరాలు
అపోహ-5: అన్ని ఆయుర్వేద మూలికలు అందరికీ ఒకేలా సరిపోతాయి
ఇది చాలా సాధారణంగా వినిపించే అపోహ. ఒకరికి ఉపయోగపడే మూలిక, మరొకరికి సరిపోకపోవచ్చు. శరీర స్వభావం, ఆరోగ్య స్థితిని బట్టి మూలికలను ఎంచుకున్నప్పుడే మంచి ఫలితం ఉంటుంది. అపోహ-6: పంచకర్మ అంటే కేవలం డీటాక్స్ ట్రెండ్ మాత్రమే పంచకర్మ స్పా చికిత్స కాదు. ఇది వైద్యుల పర్యవేక్షణలో చేయాల్సిన లోతైన చికిత్సా విధానం. సరైన ప్రణాళికతో చేస్తే, శరీర సమతుల్యతను పునరుద్ధరించి లోతైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అపోహ-7: ఆయుర్వేద నూనెలు చర్మ రంధ్రాలను మూసేస్తాయి నాణ్యమైన ఆయుర్వేద నూనెలను సరైన విధంగా ఎంచుకుని వాడితే, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మానికి సరిపోని ఉత్పత్తులను వాడినప్పుడే ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
అపోహ-8: ఆధునిక వైద్యంతో ఆయుర్వేదం కలిసి పనిచేయదు
శిక్షణ పొందిన వైద్యుల మార్గదర్శకత్వంలో ఆయుర్వేదం ఆధునిక వైద్యంతో సమన్వయంగా పనిచేస్తుంది. ఇప్పటికే చాలామంది ఈ రెండు విధానాలను కలిపి సురక్షితంగా అనుసరిస్తున్నారు. అపోహ-9: ఆయుర్వేద మందులకు దుష్ప్రభావాలు ఉండవు,కావాలంటే మనమే వాడుకోవచ్చు సహజమైనవి కాబట్టి ప్రమాదం ఉండదన్న భావన సరైంది కాదు. తప్పు మోతాదు లేదా సరిపోని మూలికలు దుష్ప్రభావాలకు దారితీయవచ్చు.వైద్యుల సలహా తీసుకోవడం భద్రతకు కీలకం. అపోహ-10: ఆయుర్వేదం పాతకాలం నాటి వైద్య విధానం సూత్రాలు ప్రాచీనమైనవే అయినా,అవి మానవ శరీర నిర్మాణం,జీవనశైలి ఆధారంగా రూపొందించబడ్డాయి కాబట్టి ఇప్పటికీ ప్రాసంగికమే.ఈ భావనలపై ఆధునిక పరిశోధనలు కూడా ఆసక్తిగా సాగుతున్నాయి.అపోహలను దాటి చూసినప్పుడే, ఆయుర్వేదం ఎంత వ్యక్తిగతంగా, తార్కికంగా పనిచేసే వైద్య విధానమో అర్థమవుతుందని నిపుణులు అంటున్నారు.