Year Ender 2024: ఇండియా నుంచి గ్రీక్ వరకూ.. అత్యుత్తమ వంటకాలు అందించిన టాప్ దేశాలివే!
ప్రసిద్ధి ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' ఇటీవల ప్రపంచంలోని ఉత్తమ వంటకాలను అందించే దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ ర్యాంకులను ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న అల్పాహారం, స్వీట్స్, నాన్‌వెజ్, వెజిటేరియన్ వంటకాలు, అలాగే ప్రసిద్ధ రెస్టారెంట్లు, పానీయాలు వంటి అంశాల ఆధారంగా నిర్ణయించింది. ఈ జాబితాలో గ్రీస్, ఇటలీ, మెక్సికో, స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాలు అగ్రస్థానాల్లో నిలవగా, భారతదేశం అత్యద్భుత రుచులతో 12వ స్థానాన్ని దక్కించుకుంది. భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి, టేస్ట్ అట్లాస్ పేర్కొన్న స్కోరింగ్‌లో కొన్ని ప్రత్యేక వంటకాలకు గణనీయమైన రేటింగ్ వచ్చింది.
అంతర్జాతీయ ప్రత్యేక గుర్తింపు
భారతదేశంలోని ప్రసిద్ధ వంటకాలలో అమృతసరి కుల్చా, బట్టర్ గార్లిక్ నాన్, ముర్గ్ మఖానీ, హైదరాబాదీ బిర్యానీ ఆహార పదార్థాలు నిలిచాయి. ప్రసిద్ధ రెస్టారెంట్లగా దమ్ పుఖ్త్ (న్యూఢిల్లీ), గ్లెనరీస్ (డార్జిలింగ్), రామ్ ఆశ్రయ (ముంబై), శ్రీ థాకర్ భోజనాలయ్ (ముంబై) ఉన్నాయి. భారతీయ వంటకాలు ప్రాచీనత, రుచులు, సాంప్రదాయాలు కలబోసిన ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. వివిధ రకాల ఆహార పదార్థాలు, పానీయాలు భారతదేశానికి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి.