చర్మ సంరక్షణ: చర్మంపై పులిపిర్లు రావడానికి కారణాలు, వాటిని పోగొట్టే విధానాలు
పులిపిర్లు చర్మంలో ఏ ప్రాంతంలోనైనా ఏర్పడతాయి. ఆడ మగా తేడా లేకుండా ఎవ్వరిలో అయినా ఇవి ఏర్పడతాయి. వీటివల్ల హాని కలగదు కానీ చర్మం మీద ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. కొందరు వీటిని క్యాన్సర్ కణతులు అని అనుకుంటారు. కానీ పులిపిర్లు అలాంటివి కావు. ఇవి కొవ్వు కణాల వల్ల, ఫైబర్ వల్ల ఏర్పడతాయి. కొన్నిసార్లు వీటిని త్వరగా గుర్తించలేరు. శరీరంలో ఒక రకమైన పరిమాణానికి చేరుకున్నప్పుడే వాటిని గుర్తించడం వీలవుతుంది. ఇవి ఎక్కడైనా ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఇవి ఎక్కువగా కనిపించే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. కనురెప్పల మీదా, ఛాతి మీద, చంకలు, మెడ, జననాంగం దగ్గరి భాగంలో ఇవి ఏర్పడతాయి.
పులిపిర్లు ఏర్పడడానికి కారణాలు
పులిపిర్లు ఏర్పడడానికి ముఖ్య కారణం, శరీరంలోని కణాలు చర్మంలోని చివరి పొర మీద పెరగడమే. ఇవి అలా పెరుగుతున్నప్పుడు చర్మం ఎక్కడైతే మడతలు పడుతుందో ఆ ప్రాంతాల్లో పెద్దగా తయారవుతాయి. అందుకే స్థూలకాయంతో బాధపడేవారికి పులిపిర్ల సమస్య ఎక్కువగా వస్తుంటుంది. వీటివల్ల నొప్పి కలగదు కానీ మనం వేసుకునే బట్టలు పులిపిర్లకు తగులుకుని ఒకరకమైన చికాకును కలిగిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడేవారిలో పులిపిర్లు ఎక్కువగా పుట్టుకొస్తాయి. అలాగే గర్భిణులకు కూడా ఇవి ఏర్పడతాయి. హెచ్ పీ వీ వైరస్ తో బాధపడే వారి చర్మం మీద కూడా పులిపిర్లు ఏర్పడతాయి. ఈ పులిపిర్లు వాటికవే నశించిపోతాయి. కొన్నిసార్లు వైద్యుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. లేజర్ ట్రీట్ మెంట్ అందుబాటులో ఉంది.