LOADING...
Top Travel List in 2026 : యూరప్ ఆల్ప్స్ నుంచి కరేబియన్ వరకు.. 2026లో సందర్శించాల్సిన ప్రపంచ ప్రసిద్ధ ప్రదేశాలు ఇవే
యూరప్ ఆల్ప్స్ నుంచి కరేబియన్ వరకు.. 2026లో సందర్శించాల్సిన ప్రపంచ ప్రసిద్ధ ప్రదేశాలు ఇవే

Top Travel List in 2026 : యూరప్ ఆల్ప్స్ నుంచి కరేబియన్ వరకు.. 2026లో సందర్శించాల్సిన ప్రపంచ ప్రసిద్ధ ప్రదేశాలు ఇవే

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2025
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూరప్ ఆల్ప్స్, కెనడా సరస్సులు, చైనా యునెస్కో వారసత్వ ప్రదేశాలు, కరేబియన్ స్పెర్మ్ వేల్ రిజర్వ్, మొరాకో వారసత్వ నగరం... 2026లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ప్రముఖ గమ్యస్థానాలుగా నిలవనున్నాయి. ఇందుకు ప్రధాన కారణాలు ప్రత్యేక అంతర్జాతీయ ఈవెంట్లు, కొత్తగా అభివృద్ధి చేసిన టూరిజం ప్రాజెక్టులు, యునెస్కో గుర్తింపులు కావడం విశేషం. ఇటలీలోని డోలోమైట్స్ ఇప్పటికే తన విశాలమైన పర్వతాలు, గుచ్చినట్లున్న శిఖరాలు, అద్భుతమైన ఆల్పైన్ ప్రకృతి దృశ్యాలతో పర్యాటకుల మనసు గెలుస్తోంది. అయితే 2026లో ఈ ప్రాంతం మరింత ప్రత్యేకంగా మారనుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇక్కడ వింటర్ ఒలింపిక్, పారాలింపిక్ గేమ్స్ జరగనుండటంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు, పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోనున్నారు.

Details

ప్రావిన్స్ ఫస్ట్ నేషనల్ పార్క్ కావడం విశేషం

కెనడాలోని కొత్తగా ఏర్పాటు చేసిన నిబిస్చి నేషనల్ పార్క్ సుమారు 4,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించి, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంది. ఇది మిస్టిసిని క్రీ నేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రావిన్స్ ఫస్ట్ నేషనల్ పార్క్ కావడం విశేషం. వాటర్ ఫ్రంట్ క్యాబిన్లు, ఫ్లోటింగ్ చాలెట్లు, బోరియల్ ఫారెస్టులు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. అలాగే ఫైర్ సైట్ స్టోరీటెల్లింగ్, వింటర్ సర్వైవల్ క్లాసులు సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని అందించనున్నాయి.

Details

ప్రముఖ పర్యాటక కేంద్రంగా బీజింగ్

చైనా రాజధాని బీజింగ్ కూడా 2026లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారనుంది. ఇటీవల దాదాపు ఐదు మైళ్ల పొడవైన బీజింగ్ సెంట్రల్ యాక్సిస్ చారిత్రక, సాంస్కృతిక కారిడార్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. దీనితో పాటు బీజింగ్‌లో కొత్త సైట్సీయింగ్ బస్సు సర్వీసు ప్రారంభమైంది. ఇది నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలను కలుపుతూ ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పిస్తుంది. రాత్రి వేళ వెలుగులతో మెరిసే గ్రేట్ వాల్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

Advertisement

Details

ప్రపంచంలోనే మొట్టమొదటి స్పెర్మ్ వేల్ రిజర్వ్

కరేబియన్‌లోని డొమినికా దేశం ప్రపంచంలోనే మొట్టమొదటి స్పెర్మ్ వేల్ రిజర్వ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 800 చదరపు కిలోమీటర్ల సముద్ర ప్రాంతాన్ని రక్షణలోకి తీసుకుని ఈ రిజర్వ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు స్పెర్మ్ వేల్స్‌ను దగ్గరగా వీక్షించే అవకాశం లేదా వాటితో ఈత కొట్టే అనుభూతిని పొందవచ్చు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత పొడవైన కేబుల్ కార్లలో ఒకదాని ద్వారా దట్టమైన వర్షారణ్యాలు, హాట్ స్ప్రింగ్స్‌ను చూడవచ్చు.

Advertisement

Details

 ప్రపంచ పుస్తక రాజధానిగా యునెస్కో రబాత్

మొరాకో రాజధాని రబాత్‌ కూడా 2026లో ప్రత్యేక గుర్తింపు పొందనుంది. చారిత్రక కట్టడాలు, ఆధునిక నిర్మాణాల సమ్మేళనంగా ఉన్న ఈ నగరంలో జాహా హదీద్ డిజైన్ చేసిన రాయల్ థియేటర్ ఆఫ్ రబాత్‌, దేశంలోనే అత్యంత ఎత్తైన భవనం మహ్మద్ VI టవర్ పర్యాటక ఆకర్షణలుగా నిలవనున్నాయి. అంతేకాదు, యునెస్కో రబాత్‌ను 2026 ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించడం నగరానికి మరింత అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది. ఇక 2026లో చూడదగిన ప్రదేశాల జాబితాలో యూకేలోని హల్, యార్క్‌షైర్ కూడా చోటు దక్కించుకున్నాయి.

Details

పర్యాటక రంగానికి ఎంతో కీలకం

హల్ నగరం తన 800 సంవత్సరాల నాటి సముద్ర వారసత్వాన్ని కొత్త రూపంలో ప్రపంచానికి పరిచయం చేయనుంది. 53 మిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టిన పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో భాగంగా హల్ మారిటైమ్ మ్యూజియం, నార్త్ ఎండ్ షిప్‌యార్డ్‌తో పాటు రెండు చారిత్రక నౌకలు - ఆర్కిటిక్ కోర్సియర్, స్పర్న్ లైట్షిప్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ అన్ని ప్రత్యేకతలతో 2026 సంవత్సరం ప్రపంచ పర్యాటక రంగానికి ఎంతో కీలకంగా మారనుంది.

Advertisement