Gita Jayanti 2025 :నేడు గీతా జయంతి..నిష్కామ కర్మే జీవిత విజయ రహస్యం
ఈ వార్తాకథనం ఏంటి
హిందువులకు అత్యంత పవిత్రమైన గ్రంథం భగవద్గీత అవతరణ దినంగా గీతా జయంతిని జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాస శుద్ధ ఏకాదశి రోజున ఈ పర్వదినం నిర్వహించబడుతుంది. కర్తవ్య నిర్వహణలో తలమునకకు లోనై ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో పడిన అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు యుద్ధభూమిలో ఇచ్చిన మహోపదేశాల సమాహారమే ఈ గీత. అది కేవలం అర్జునుడికే పరిమితం కాదు.. జీవితంలో నిర్ణయాలు తీసుకోవడం, బాధ్యతలు నిర్వర్తించడం సమయంలో ఎదురయ్యే అనేక ప్రశ్నలకు సమాధానంగా నేటి సమాజంలో కూడా సమాన ప్రాధాన్యంతో నిలుస్తోంది. కృష్ణుడు-అర్జునుడి సంభాషణలోని ప్రధాన ఉద్దేశం యుద్ధం గురించే చెప్పడం కాదు.
వివరాలు
గీత సందేశం తాత్విక గూడార్థాలకే పరిమితమైనది కాదు
ప్రతిరోజూ మన జీవితాన్ని వివేకంతో ఎలా గడపాలో మార్గదర్శనం చేయడమే అసలు బోధ. అందులో ముఖ్యంగా నిష్కామ కర్మ సిద్ధాంతం ప్రధాన స్థానం పొందుతుంది. అంటే.. ఫలితం గురించి ఆలోచించకుండా, తన శక్తిమాత్రం మేర కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించడం. ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద.. కోరికలకతీతంగా కర్మలను ఆచరించడం యోగ సాధనలో అత్యంత కీలకమైన అంశమని వివరించారు. తన ప్రసిద్ధ గీతాభాష్యం 'గాడ్ టాక్స్ విత్ అర్జున: ది భగవద్గీత' లో గీత సందేశం తాత్విక గూడార్థాలకే పరిమితమైనది కాదని, కుటుంబ జీవితం గడిపేవారికైనా, సంస్థలను నడిపే నాయకులకైనా, ఆధ్యాత్మిక అన్వేషకులకైనా సమంగా ఉపయోగపడే ఆచరణాత్మక జీవన మార్గదర్శి అని స్పష్టంచేశారు.
వివరాలు
పనిపై దృష్టిపెడితే మనసుకు అసలైన స్వేచ్ఛ
భగవద్గీత రెండో అధ్యాయంలోని 47వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా బోధిస్తారు.. "కర్మలను చేయుటయందే నీ హక్కు ఉంది. వాటి ఫలితాలపై నీకు అధికారం లేదు. ఫలితాలను సృష్టించేది నీవేనని భావించవద్దు. అలాగని కర్మల నుంచి దూరంగా ఉండే మానసికస్థితికి లోనవ్వకూడదు." దీనిలోని భావం ఏమిటంటే.. ఉద్యోగమైనా కావచ్చు, కుటుంబ బాధ్యతలు కావచ్చు,లేదా ఇతర సామాజిక కర్తవ్యాలైనా కావచ్చు - ఏ పని అయినా సంపూర్ణంగా చేయాలి. కానీ ఫలితాల గురించి, పేరు ప్రతిష్టల గురించి నిరంతరం ఆలోచిస్తూ చింతించకూడదు. "నాకెంత లాభం లభించింది" అనే ఆలోచన ఒత్తిడినే పెంచుతుంది. పనిపై దృష్టిపెడితే మనసుకు అసలైన స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో అలసత్వం కానీ, నిర్లక్ష్యం కానీ చోటుచేసుకోకూడదు.
వివరాలు
జీవితంలో ప్రశంసలూ వస్తాయి.. విమర్శలూ వస్తాయి
48వ శ్లోకంలో ఆయన మరో ముఖ్యమైన సందేశం ఇస్తారు.. "ఓ ధనంజయా.. యోగస్థితిలో నిలబడి సమస్త కర్మలను ఆచరించుము. ఫలితాలపై ఆసక్తిని విడిచిపెట్టి, జయం - అపజయాలలో సమభావంతో ఉండుము. ఇదే యోగం." జీవితంలో ప్రశంసలూ వస్తాయి.. విమర్శలూ వస్తాయి. విజయం ఎదురవుతుంది.. ఓటమి కూడా సంభవిస్తుంది. ఏ పరిస్థితిలోనైనా మనసు ప్రశాంతంగా నిలుచునే విధానమే యోగం అని శ్రీకృష్ణుడు చెబుతాడు. లోపల శాంతితో ఉండి, బయట బాధ్యతలను నిర్వర్తించగలగడమే అసలైన సాధన.
వివరాలు
మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని భగవంతునికి అంకితం చేయాలి
మూడో అధ్యాయంలోని 30వ శ్లోకం ఈ ఆచరణకు దారి చూపుతుంది.. "నీ అన్ని పనులను నాకు అర్పించుము. ఆశలు, అహంకారాన్ని విడిచిపెట్టి, ఆత్మపై మనసు కేంద్రీకరించి, చింతలను వదిలి ధైర్యంగా కర్మయుద్ధంలో పాల్గొనుము." సరళంగా చెప్పాలంటే - మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని భగవంతునికి అంకితం చేయాలి. దీనర్థం ప్రపంచాన్ని వదిలేయడం కాదు. కోరికల కలుషితమై లేని మనసుతో, అహంకారం లేకుండా, ఫలితాలపై అపేక్ష లేకుండా పని చేయడం. ఈ విధంగానే అంతరంగిక శాంతి సాధ్యమవుతుంది.
వివరాలు
ఈ శాశ్వత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో పరమహంస యోగానంద కీలక పాత్ర
ఐదవ అధ్యాయంలో 10వ శ్లోకంలో ఒక అందమైన ఉపమానం ఇచ్చారు.. "నీటితో మసకబడని తామరాకు లాగానే, యోగి ఆసక్తిని వదిలిపెట్టి తన కర్మలను భగవంతునికి సమర్పిస్తే, ప్రాపంచిక బంధాలకు అతీతంగా ఉంటాడు." బురదలో పెరిగినప్పటికీ మురికి అంటుకోని కమలంలా.. ఈ లోకపోరాటాల మధ్య జీవిస్తూ కూడా, నిష్కామ కర్మచరణతో ప్రశాంతంగా ఉండగలమని ఈ ఉపమానం చెబుతుంది. ఈ శాశ్వత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో పరమహంస యోగానంద కీలక పాత్ర పోషించారు. పశ్చిమదేశాల్లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (SRF)ను, భారత్‌లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాను (YSS) స్థాపించి గీత బోధను విస్తృతంగా ప్రచారం చేశారు.
వివరాలు
మన జీవన పోరాటం నిజమైనదే
ఆయన రచించిన 'ఒక యోగి ఆత్మకథ' గ్రంథం ద్వారా లక్షలాది మందికి యోగసాధన, ధ్యానం, ముఖ్యంగా క్రియాయోగం అనే సనాతన సాధనా పద్ధతిని పరిచయం చేసి, దైవానుభూతికి దారి చూపించారు. నిష్కామ కర్మ అంటే బాధ్యతల నుంచి దూరమవ్వడం కాదు. వ్యక్తిగత జీవితంలోనూ,ఉద్యోగ పరమైన పనుల్లోనూ, మానవ సంబంధాల్లోనూ పూర్తి బాధ్యతతో కృషి చేయడం-కానీ ఫలితాల మీద అనవసర తాపత్రయం లేకుండా ఉండడమే దీని అసలు అర్థం. యుద్ధభూమి ప్రతీక మాత్రమే కావచ్చు. కానీ మన జీవన పోరాటం నిజమైనదే. మోహానికి-విముక్తికి మధ్య,అహంకారానికి-శరణాగతికి మధ్య జరుగుతున్న ఈ అంతర్గత యుద్ధంలో నిష్కామ కర్మే విజయం సాధించే మార్గమని భగవద్గీత స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే అదే మనకు నిత్యమైన ఆనందం,ఆత్మశాంతిని ప్రసాదించగల ఏకైక మార్గం.