Google Techie: గూగుల్ టెక్కీకి చేదు అనుభవం .. ఇంటర్నెట్ లో పెద్ద ఎత్తున చర్చ
ఉద్యోగం కోసం ఏదైనా కంపెనీకి దరఖాస్తు చేసినప్పుడు, కొన్ని సందర్భాల్లో వివిధ కారణాలతో తిరస్కరిస్తారు. తగిన అర్హతలు లేదా అనుభవం లేకపోవడం వంటి కారణాలు సాధారణంగా కనిపిస్తాయి. అయితే, తనకు ఎదురైన అసాధారణ అనుభవం గురించి గూగుల్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనూ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఢిల్లీకి చెందిన అనూ శర్మ గతంలో ఓ స్టార్టప్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆమె దరఖాస్తు తిరస్కరించబడింది. ఈ కంపెనీ తిరస్కరణకు ఇచ్చిన కారణం విడ్డూరంగా అనిపించింది.
ఇంటర్నెట్ లో యూజర్లలో విస్తృత చర్చ
"మీ రెజ్యూమ్‌ని సమీక్షించిన తర్వాత, మీ అర్హతలు ఉద్యోగ అవసరాలను మించి ఉన్నట్లు మేము గ్రహించాం. అధిక అర్హతలు ఉన్న అభ్యర్థులు ఎక్కువ కాలం పని చేయలేరని, చేరిన కొద్ది రోజులకు వెళ్లిపోతారని మా అనుభవం సూచిస్తోంది" అని రిక్రూటర్ రిజెక్షన్ లెటర్‌లో వివరించారు. మంచి అర్హతలు ఉన్నందుకు కూడా తిరస్కరించడం తనకు తెలియదని అనూ శర్మ 'ఎక్స్' (ట్విటర్)లో రిజెక్షన్ లెటర్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు. ఇది యూజర్లలో విస్తృత చర్చకు దారితీసింది. వారు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నట్లు కామెంట్లు చేశారు. ఒక యూజర్,తాను ఉన్నత ర్యాంకింగ్ ఉన్న కాలేజీ నుంచి వచ్చినందుకుగాను రిజెక్ట్ అయ్యానని చెప్పాడు. అయితే, మంచి అర్హతలను రిక్రూటర్ అభినందించడం మంచి విషయమని మరికొందరు అభిప్రాయపడ్డారు.