బయట వర్షం వల్ల ఇంట్లో బోర్ కొడుతుంటే ఈ క్రియేటివ్ యాక్టివిటీస్ ట్రై చేయండి
వర్షాకాలం మొదలైంది. చాలా ప్రాంతాల్లో బయటకు వెళ్ళలేనంతగా వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అయితే పూర్తిగా ఇంట్లోనే ఉండటం కొంత ఇబ్బందే. అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఇంట్లోనే ఉండి కొన్ని క్రియేటివ్ పనులు చేయాలి. అవేంటో చూద్దాం. వర్షాన్ని కొలిచే సాధనం తయారు చేయండి: ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని దాని పై భాగాన్ని కోసేయండి. ఇప్పుడు ఆ కోసేసిన గరాటు లాంటి భాగాన్ని రివర్స్ చేసి అదే బాటిల్ లో ఉంచాలి. అంతకంటే ముందు బాటిల్ లోపల ఇసుక, కొన్ని గులకరాళ్ళు వేయండి. ఇప్పుడు బయట వర్షం పడుతుంటే దాన్ని వర్షంలో పెట్టండి. కాసేపయ్యాక రూలర్, మార్కర్ తీసుకెళ్ళి వర్షపాతం ఎంత ఉందో గుర్తించండి.
బాల్యాన్ని గుర్తు చేసే వర్షాకాలం
మీలోని ఫోటోగ్రాఫర్ కు పనిచెప్పండి: వర్షం వల్ల నేలంతా తడిచి కొత్తగా కనిపిస్తుంది. ఆ అందం మరింత అందంగా ఉంటుంది. వర్షంలో తడిసిన మైదానాలను, ఆకులపై రాలిన వర్షపు చుక్కలను ఫోటో తీయండి. బాల్కనీలో వంట చేయండి: ఎప్పుడూ కిచెన్లో వండటం కాదు, అటు వర్షపు చినుకులను చూస్తూ బాల్కనీలో వంట చేస్తుంటే ఆ కిక్కే వేరు. వేడి వేడి మిర్చి, కరకరలాడే పకోడి తింటే ఆ ఫీలింగే వేరు. పేపర్ బోట్ తయారు చేయండి: చిన్నప్పుడు ఎప్పుడో ఆడిపడేసిన పేపర్ బోటును ఇప్పుడు తయారు చేయండి. పేపర్ బోటును మీ ఇంటి ముందు పారుతున్న వర్షపు నీటిలో వేయండి. వర్షపు నీళ్ళ ప్రవాహంలో అది వెళ్తుంటే ఆనందించండి.