Page Loader
Motivation : ప్రయత్నం నీదైతే… గెలుపు కూడా నీదే!
ప్రయత్నం నీదైతే… గెలుపు కూడా నీదే!

Motivation : ప్రయత్నం నీదైతే… గెలుపు కూడా నీదే!

వ్రాసిన వారు Sirish Praharaju
May 23, 2025
08:20 am

ఈ వార్తాకథనం ఏంటి

కొంతమంది జీవితంలో విజయం సాధించలేకపోవడానికి నానావిధాలైన లేనిపోని కారణాలను చెప్పుకుంటూ ఓటమిని అంగీకరించేస్తుంటారు. సరే, ఎంతకైనా ప్రయత్నం చేసి ఓడిపోయినవాళ్లను గౌరవించొచ్చు. కానీ చాలా మంది మొదటి అడుగే వేయకుండా ఓడిపోయినట్టు భావించి ఇంట్లోనే కూర్చుంటారు. "ఇలా చేసినా బాగుండేది... అలా చేసుంటే మంచిదేది..." అంటూ మిగిలినవాళ్లకు సూక్తులు చెబుతుంటారు. కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే.. విజయాన్ని సాధించకపోయినా, ప్రయత్నించామన్న తృప్తి మనసులో మిగిలేది కదా! ఈ సత్యాన్ని అర్థం చేసుకునే ముందు... ఒక గొప్ప పక్షి గురించి తెలుసుకుందాం.

వివరాలు 

గద్ద చెప్పే జీవిత పాఠం 

ఆకాశంలో గద్దను చూస్తే మనకు అది కోడి పిల్లలను ఎత్తుకుపోయే శక్తివంతమైన పక్షిలా కనిపిస్తుంది. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మన జీవితాన్ని మార్చే గొప్ప కథ దాగి ఉంది. గద్ద సుమారు 70 సంవత్సరాల ఆయుష్కాలంతో జీవిస్తుంది. అయితే,దానికి 40 ఏళ్ల వయస్సు వచ్చేసరికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో గద్ద పంజాలు చాలా పొడవుగా పెరిగిపోతాయి, దాంతో ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది. అలాగే దాని ముక్కు ముందువైపు వంకరగా మారిపోతుంది. రెక్కలపై ఈకలు కూడా మితిమీరిన స్థాయిలో పెరిగి బరువుగా మారి ఎగిరే శక్తిని తగ్గిస్తాయి. ఇప్పుడు గద్ద ఎదుట రెండు మార్గాలుంటాయి.. ఒకటి నిశ్చలంగా ఉండి ఆహారం లేక చచ్చిపోవడం. రెండోది.. తాను తానే మార్పును స్వీకరించడం.

వివరాలు 

గద్ద చెప్పే జీవిత పాఠం 

గద్ద రెండో మార్గాన్ని ఎంచుకుంటుంది. ఇది కేవలం చిన్న మార్పు కాదు... ఒక పెద్ద పునర్జన్మతో సమానం. దాని కోసం అది ఒక ఎత్తైన కొండపైకి వెళ్లి అక్కడే స్థిరపడుతుంది. అక్కడ తన వంకరమయిన ముక్కును తనే వలిచి తుడిచేస్తుంది. నొప్పితో బాధపడినా, ఆ కొత్త ముక్కు తిరిగి పెరిగేంతవరకు ఎదురుచూస్తుంది. తర్వాత ఆ పదునైన ముక్కుతో పాత పంజాలను తొలగిస్తుంది. చివరకు తన పెద్దఈకలన్నింటిని కూడా తానే పీకేసి విడిచేస్తుంది. ఈ విధంగా దాదాపు 150 రోజుల నిదానమైన పునర్నిర్మాణానికి గురవుతుంది. ఆ తర్వాత కొత్త ముక్కు, కొత్త పంజాలు, కొత్త ఈకలతో కొత్త శక్తిని సంతరించుకుంటుంది. తిరిగి గాల్లోకి ఎగిరిపోతుంది... మరలా జీవితం కోసం, పోరాటం కోసం ముందుకు దూసుకెళ్తుంది.

వివరాలు 

ఈ కథని మనం ఎందుకు గుర్తుంచుకోవాలి? 

జీవితంలో చిన్న అడ్డంకులకే భయపడి మానేయడం కాదు... మార్పును స్వీకరించి ముందుకు సాగడమే విజయానికి మార్గం. మనకు విజయాన్ని పొందాలంటే ముందుగా మనలో మార్పు రావాలి. లేకపోతే మన జీవితమే మనకు బోర్ అనిపిస్తుంది. ఇక ఇతరులు కూడా మనల్ని పక్కన పెట్టేస్తారు. నీ జీవితం... నీదే... నీ రాత రాసేది ఎవరు? నీ దారి మార్చేది ఎవరు? కలలు నీవి... కష్టం నీదే... ఆలోచించేది నీవే... ఆ సాధన నీదే... ఓటమి నీదే... గెలుపు కూడా నీదే... నీ ప్రయత్నం... నీ విజయం... నీ జీవితం... అంతా నీ చేతుల్లోనే ఉంది.