Christmas Tree: క్రిస్మస్ ట్రీపెట్టడం ఎప్పుడు మొదలైంది.. ఎందుకు అలంకరించాలి?
ప్రపంచంలో క్రిస్మస్ పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇది క్రైస్తవ సోదరుల అత్యంత ముఖ్యమైన పండుగగా గుర్తించబడింది. ఈ పండుగ ఎప్పుడు వస్తుందా అని వారు ఏడాదంతా ఎదురుచూస్తారు. డిసెంబర్ 25న ఈ పండుగను నిర్వహించడం అనేది యేసుక్రీస్తు జన్మించిన రోజు అని నమ్మకం. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా వివిధ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం నిర్వహిస్తారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా క్రిస్మస్ ట్రీని అలంకరించడం ఒక అందమైన సంప్రదాయం. ఈ రోజు ఇళ్లను రంగురంగుల దీపాలతో, క్రిస్మస్ ట్రీని కూడా అలంకరించి, బంధుమిత్రులకు బహుమతులు ఇచ్చి, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ రోజున క్రిస్మస్ చెట్టు అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
16వ శతాబ్దంలో ఈ క్రిస్మస్ చెట్టు అలంకరణ
క్రిస్మస్ ట్రీకు చరిత్ర కూడా ఉంది. గ్రీకులు, రోమన్లు తమ ఇళ్లలో పచ్చని చెట్లను అలంకరించటం ఒక పండుగ ఆచారంగా ప్రారంభించారు. యూరోపియన్ దేశాలలో కూడా శీతాకాలపు పండుగలు నిర్వహించేటప్పుడు ఇళ్లను పచ్చని చెట్లతో అలంకరించడం సాధారణం అయింది. అంతేకాక, క్రిస్మస్ పండుగ సందర్భంగా కూడా ఈ చెట్లను అలంకరించడం మొదలైంది. టిఫిన్ బొమ్మలు, గంటలు, టాఫీలు, రిబ్బన్లు, లైట్లు ఇలా అన్ని విధాలుగా చెట్లను అలంకరిస్తారు. మార్టిన్ లూథర్ అనే క్రైస్తవ సంస్కర్త 16వ శతాబ్దంలో ఈ క్రిస్మస్ చెట్టు అలంకరణను ప్రారంభించినట్టు చెప్తారు. ఒక కథ ప్రకారం, డిసెంబర్ 24 సాయంత్రం ఆయన అడవిలో నడుచుకుంటూ,మంచుతో కప్పబడిన అడవిలో ఒక సతత హరిత వృక్షాన్ని కనుగొన్నాడు.
జర్మనీలో క్రిస్మస్ చెట్టును అలంకరించే ఆచారం
వెన్నెల దాని కొమ్మలపై పడుతూ ఉండగా, ఆ చెట్టును తీసుకెళ్లి ఇంట్లో అలంకరించాడు. అది చూసిన ప్రజలు కూడా ఆ చెట్టును అలంకరించడం ప్రారంభించారు,ఇది కొన్నేళ్లకు ఒక సంప్రదాయం అయింది. ఇంకా, క్రిస్మస్ ట్రీకి సంబంధించి ఒక మరొక ప్రసిద్ధ కథ కూడా ఉంది. క్రీ.శ.722లో జర్మనీలో క్రిస్మస్ చెట్టును అలంకరించే ఆచారం మొదలైనట్టు చెబుతారు. సెయింట్ బోనిఫేస్ అనే మనిషి ఓక్ చెట్టును నరికిన తర్వాత,అక్కడ ఒక అందమైన చెట్టు పెరిగిందని చెబుతారు. ఈ చెట్టును దివ్య వృక్షంగా పరిగణించి,అది ప్రజలకు యేసుక్రీస్తు పుట్టినరోజున అలంకరించాలనీ చెప్పారు. కథల విషయం ఎలా ఉన్నా క్రిస్ మస్ రోజు క్రిస్మస్ ట్రీ పెడితే వచ్చే పండుగ కళే వేరు.