
Holi 2023: రసాయనాలు లేని రంగులు తయారు చేద్దాం రండి
ఈ వార్తాకథనం ఏంటి
హోలీ పండగ మరెంతో దూరంలో లేదు. ఇప్పటి నుండే పండగ ప్రిపరేషన్స్ జరిగిపోతున్నాయి. ఐతే ఈసారి హోలీలో రసాయనాలున్న రంగులను వాడకండి. సహజ సిద్ధమైన రంగులను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ఎరుపు రంగు:
ఎర్రగులాబీ రేకులను ఎండలో ఎండబెట్టి, ఆ తర్వాత గ్రైండర్ లో వేసి పొడి తయారు చేయండి. గులాబీల బదులు మందార పువ్వులను కూడా వాడవచ్చు.
ఇంకా, ఎర్రగులాబీ రేకులను లేదా దానిమ్మ తొక్కలను నీళ్ళలో ఉడకబెట్టి కూడా ఎరుపు రంగు చేయవచ్చు.
పసుపు రంగు:
శనగపిండి, పసుపును 1:2నిష్పత్తిలో తీసుకుని మిక్స్ చేయండి. బాగా మిక్స్ అయ్యాక జల్లెడ పట్టండి.
ఇంకా, బంతిపువ్వు రేకులను నీళ్ళలో వేసి, కొంచెం పసుపు వేసి బాగా ఉడకబెట్టండి. పసుపు రంగు తయారవుతుంది.
హోళీ పండగ
నీలం, ఆకుపచ్చ, నారింజ రంగుల తయారీ
ఆకుపచ్చ రంగు తయారీ:
గోరింటాకు పొడి, మైదా పిండి కలిపి మీరు గ్రీన్ కలర్ తయారు చేయవచ్చు. అయితే హెన్నా పౌడర్ వాడేటపుడు దానిలో ఎలాంటి రసాయనాలు లేకుండా చూసుకోండి.
ఇంకా, పుదీనా ఆకులను బాగా ఉడకబెడితే కూడా ఆకుపచ్చ రంగు తయారవుతుంది.
నీలం రంగు తయారీ:
నీలిరంగులోని తురాయి పూల రేకులను, శంఖు పుష్పం రేకులను ఎండబెట్టి పొడిగా మార్చండి. తురాయి పువ్వులు వేసవిలో పూస్తాయి. సాధారణంగా రోడ్ల పక్కన ఎక్కువగా కనిపిస్తాయి.
నారింజ రంగు తయారీ:
గోగు పువ్వులను తీసుకొచ్చి ఎండబెట్టిన తర్వాత పొడిలాగా చేయండి. ఇంకా, నారింజ తొక్కలను, మొక్కజొన్నపిండిని, పసుపును కలిపి గ్రైండర్ లో వేస్తే నారింజ రంగు తయారవుతుంది.